● దేవస్థాన చైర్మన్ అవధాని మోహన్ శర్మ
● ఈఓ మహేష్‌తో కలిసి పనుల పరిశీలన
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానంలో జరుగుతున్న పునర్నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని దేవస్థాన చైర్మన్ అవధాని మోహన్ శర్మ అన్నారు. మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో గత ఐదు రోజులుగా కొనసాగుతోన్న కూల్చివేతలను దేవస్థానం ఈఓ మహేష్‌తో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శివరామ్ అండ్ కంపెనీ నిర్వాహకులతో సమావేశమై పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఆలయ ఆధ్యాత్మిక వైభవానికి అనుగుణంగా, భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి నిర్మాణాన్ని చేపట్టాలని ఆదేశించారు. అనంతరం అధిముక్తీశ్వర స్వామి వారి ఆలయం, బాలాలయాన్ని సందర్శించి అక్కడ భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. రాబోయే శ్రావణమాసంలో వేలాది మంది భక్తులు దర్శనానికి వచ్చే అవకాశమున్నందున దర్శనం, అభిషేకాలు, ప్రత్యేక పూజలు, క్యూలైన్లు, తాగునీరు, ప్రసాదాల పంపిణీ, పరిశుభ్రత తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. శ్రావణమాసంలో నిర్వహించే అభిషేక పూజలు, కాలసర్ప దోష నివారణ పూజలు, శని పూజలు, ఇతర ప్రత్యేక పూజలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చైర్మన్ తెలిపారు. ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించుకునే విధంగా దేవస్థానం తరుపు అన్ని చేస్తున్నట్లు పేర్కొన్నారు. వారి వెంట ఆలయ ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఉన్నారు.


