● మాజీ ఎమ్మెల్యే
గండ్ర వెంకటరమణారెడ్డి
● ఆస్పత్రి పరిశీలన
భూపాలపల్లి రూరల్: జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆస్పత్రి సమస్యలకు నిలయంగా మారిందని సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. ఆదివారం ఆయన ఆస్పత్రిని పరిశీలించి మాట్లాడారు. జిల్లా ఆస్పత్రిలో తాగునీటి సమస్య, అపరిశుభ్రమైన వాతావరణం, రోగులకు కనీస సౌకర్యాల లేవని, వైద్య సేవలపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నెలకి రెండుసార్లు విజిట్ చేశామని, ఆస్పత్రికి కలెక్టర్, జిల్లా వైద్య అధికారులతో మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ నిత్యం సమీక్షలు నిర్వహించి ఆస్పత్రి అంటే ప్రజలకు భరోసా, నాణ్యమైన వైద్యం అందించేవారని తెలిపారు. కానీ ప్రస్తుతం చిన్న సమస్య వచ్చినా ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది జిల్లా జనరల్ ఆస్పత్రా లేక రిఫరల్ సెంటరా...? అని ప్రశ్నించారు. ఐదు రోజులుగా తాగునీటి సరఫరా లేపోవడంతో తాగునీటి కోసం బయట నుంచి బాటిళ్లలో నీటిని తెచ్చుకుంటున్నారన్నారు. ఎమ్మారై స్కాన్ ప్రారంభించి నెల రోజుల పైనే అవుతున్నా సంబంధిత సిబ్బంది లేరని తెలిపారు. సంబంధిత మంత్రి రాజనర్సింహా ఆస్పత్రిని తనిఖీ చేసి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రజల ఆరోగ్యాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా చూడాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని వీడి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.


