టికెట్ రాని వారు అధైర్యపడొద్దు
భూపాలపల్లి అర్బన్: బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్ టికెట్ ఆశించి అవకాశం దక్కని నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ కోరారు. జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించి, వారికి బీ–ఫారాలు అందజేశారు. బండా ప్రకాశ్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలకు భూములు, రూ.100 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. పార్టీ శ్రేణులతో చర్చలు, సర్వేల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. రైతుబంధు సహా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ఆశించిన ప్రతీ ఒక్కరికీ టికెట్ ఇవ్వడం సాధ్యం కాదని, పార్టీ ‘సెలెక్ట్ అండ్ ఎలెక్ట్’ విధానంలో అభ్యర్థులను ఎంపిక చేసిందన్నారు. టికెట్ రాని వారికి పార్టీ నిర్మాణంలో, నామినేటెడ్ పదవుల్లో తగిన అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బుర్ర రమేష్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ కుమార్ యాదవ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీశ్‌రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ నూనె రాజు, పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
శాసనమండలి డిప్యూటీ చైర్మన్
బండా ప్రకాశ్


