జనగామ రూరల్: సూపర్ ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోందని, అనేక ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తే పరిస్థితులు ఉన్నాయని వాటిని సమష్టిగా ఎదుర్కోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. సోమవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులతో మాట్లాడి, యాసంగి 2026–27 పంటల సాగు ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జనగామ మండలం చీటకోడూరు గ్రామంలోని రైతు వేదిక నుంచి ఈ కార్యక్రమానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 62 రైతు వేదికల్లో ఈకార్యక్రమం నిర్వహించారు. చీటకోడూరు గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా రైతులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రాబోయే నెలల్లో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున, రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంటల సాగు ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున, అధిక నీరు అవసరమయ్యే వరి వంటి పంటల సాగు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.
డ్రిప్, స్ప్రింక్లర్ల వినియోగానికి ప్రాధాన్యం
సాగునీటి కొరతను అధిగమించేందుకు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను రైతులు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. చౌడారం గ్రామానికి చెందిన రైతు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. 28 నుంచి 30 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న తాను, 15 ఏళ్లుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై అనుభవం కలిగి ఉన్నట్లు వివరించారు. ఈ సందర్భంగా రైతుల సందేహాల ను కలెక్టర్ నివృత్తి చేశారు. ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ సంపత్ రెడ్డి, డీహెచ్‌ఎస్‌ఓ నర్సయ్య, ఏపీడీ నూరుద్దీ న్, డీసీఓ కరుణ, ఏడీఏ అపర్ణ, ఎంపీడీఓ మహేష్ నాయక్, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, ఏఈఓ అనిల్, సర్పంచ్ యాదగిరి, రైతులు పాల్గొన్నారు.
తాగునీటికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి
వీసీలో ఉప ముఖ్యమంత్రి
మల్లు భట్టివిక్రమార్క
చీటకోడూర్ రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్


