జనగామ రూరల్: ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా వ్యాప్తంగా మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లా వ్యాప్తంగా 12 మండలాల్లో 92 దరఖాస్తులు స్వీకరించారు. మండల స్థాయిలో వివిధ శాఖల అధికారులు హాజరుకాగా ఇందులో ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలపైనే దరఖాస్తులు వచ్చాయి. దేవరుప్పుల మండలంలో 26 దరఖాస్తులు రాగా రఘునాథపల్లిలో 18 వచ్చాయి. మిగతా మండలాల్లో 10 లోపు దరఖాస్తులు వచ్చాయి.
కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల నిరసన
జనగామ: సమాన పనికి..సమాన స్థాయిలో స్టైఫండ్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న 22 మంది విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన వైద్య పట్టభద్రుల నిరసన సోమవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. విధులు బహిష్కరించి ఆస్పత్రి ఎదుట ఫ్లకార్డులతో ఆందోళన చేపట్టారు. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసి అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై, ప్రస్తుతం ఇంటర్న్‌షిప్, హౌస్ సర్జన్ లుగా సేవలందిస్తున్న తమకు నెలకు రూ.5,000 మాత్రమే స్టైఫండ్ చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో వైద్య విద్య పూర్తి చేసిన హౌస్ సర్జన్‌లకు నెలకు రూ.29,900 చెల్లిస్తున్నారని, తాము కూడా వారితో సమానంగా సేవలందిస్తున్నామన్నారు.
మేధావులు బీజేపీకి
మద్దతుగా నిలవాలి
జనగామ రూరల్: ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రైవేటు టీచర్లు, పట్టభద్రుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న బీజేపీకి పట్టభద్రులు, మేధావులు మద్దతు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి కోరారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి నిరుద్యోగ భృతికి బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్, భరత్ ప్రసాద్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరుట్ల దశమంత రెడ్డి, అభినవ్, భాస్కర్, సిరికొండ విద్యాసాగర్ రెడ్డి, రమేశ్, శివరాజ్ యాదవ్, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఎంపీ దిష్టిబొమ్మ దహనం
బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు సాంబ జీవనజ్యోతి ఆధ్వర్యంలో మణిపూర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డాక్టర్ అంగొంచ బీమోల్ అకోజామ్ ఫొటోను దహనం చేశారు. కాంగ్రెస్ ఎంపీ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ అసభ్యమైన పదజాలాన్ని ఉపయోగించారని మండిపడ్డారు.


