మహిళలకు చీరల కానుక | - | Sakshi
Sakshi News home page

మహిళలకు చీరల కానుక

Oct 13 2026 12:59 AM | Updated on Oct 13 2026 12:59 AM

జనగామ: జిల్లాలో మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారితో పాటు నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఉచితంగా చీరలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మహిళలకు యూనిఫామ్‌ కోడ్‌గా చిలకపచ్చ రంగు చీరలను అందించనుంది. జిల్లాకు మొత్తం 1,40,000 చీరలు మంజూరు కాగా, ఇప్పటి వరకు 81 వేల చీరలు చేరుకున్నాయి. వీటిని అధికారులు గోదాంలో భద్రపరిచారు. మిగిలిన 39 వేల చీరలు త్వరలోనే జిల్లాకు చేరనున్నాయి. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందిన అనంతరం పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది.

1.20 లక్షల మంది మహిళలకు..

జిల్లాలో మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న సుమారు 1.20లక్షల మంది మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నారు. వీరితో పాటు మహిళా సంఘాలతో సంబంధం లేని నిరుపేద కుటుంబాలకు చెందిన మరో 20 వేల మంది మహిళలకు కూడా ఉచితంగా అందించనున్నారు. ఈ విధంగా మొత్తం 1.40లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా మహిళా సంఘాల్లో సభ్యత్వం లేని పేద కుటుంబాల మహిళలను కూడా లబ్ధిదారులుగా గుర్తించడం ఈ కార్యక్రమంలో ప్రత్యేకతగా నిలుస్తోంది. జిల్లాలోని 12 మండలాల పరిధిలో అర్హులైన మహిళలకు చీరలు అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

చిలకపచ్చ రంగులో ప్రత్యేక చీరలు

ఈసారి ప్రభుత్వం పంపిణీ చేయనున్న చీరలు ప్రత్యేక రంగులో ఉండనున్నాయి. చిలకపచ్చ రంగుతో పాటు ఎరుపు రంగు అంచు, ఎరుపు రంగు బ్లౌజ్‌తో కూడిన చీరలను మహిళలకు అందించనున్నారు. గతంలో కూడా ప్రభుత్వం మహిళలకు చీరలను పంపిణీ చేయగా, ఈసారి రంగులో మార్పు తీసుకొచ్చింది. మహిళలకు ఒకే తరహా చీరలను అందించడం ద్వారా సంఘాల కార్యక్రమాల్లో యూనిఫామ్‌ కోడ్‌ను అమలు చేయడంతో పాటు, సామూహిక కార్యక్రమాల్లో ప్రత్యేక గుర్తింపు కల్పించాలనే ఉద్దేశంతో ఈ పంపిణీ చేపడుతున్నారు.

ప్రభుత్వ మార్గదర్శకాల కోసం ఎదురుచూపులు

ప్రస్తుతం జిల్లాకు చేరుకున్న 81 వేల చీరలను గోదాంలో భద్రపరిచిన అధికారులు, ప్రభుత్వం నుంచి అధికారిక మార్గదర్శకాలు అందిన వెంటనే పంపిణీ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. మండలాల వారీగా చీరలను పంపిణీ చేయాలని భావిస్తున్నారు. పంపిణీ సమయంలో మహిళలు తమ రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డులను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. లబ్ధిదారుల వివరాలను పరిశీలించి, అర్హతను నిర్ధారించిన అనంతరం చీరలు అందించే అవకాశం ఉంది. పంపిణీ తేదీలు, కేంద్రాలు, ఇతర విధివిధానాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

మిగిలిన చీరల రాకతో పంపిణీకి వేగం

ప్రభుత్వ మార్గదర్శకాలు అందిన వెంటనే మండలాల వారీగా కార్యాచరణ రూపొందించి, అర్హులైన మహిళలకు చీరలు అందించడంపై అధికారులు దృష్టి సారించనున్నారు. పంపిణీ ప్రక్రియలో ఎలాంటి గందరగోళం లేకుండా లబ్ధిదారుల వివరాల పరిశీలన, చీరల కేటాయింపు సమన్వయంతో చేపట్టాల్సి ఉంటుంది.

చిలకపచ్చ రంగుతో పాటు

ఎరుపు రంగు అంచుతో ప్రత్యేక ఆకర్షణ

జిల్లాకు 1.40 లక్షల చీరల మంజూరు, గోదాంకు చేరుకున్న 81వేలు

మహిళా సంఘాలతో పాటు నిరుపేద మహిళలకు పంపిణీ

ప్రభుత్వ మార్గదర్శకాల కోసం

ఎదురుచూపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement