● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ: దేశవ్యాప్తంగా ఓట్ల తొలగింపు ప్రక్రియతో రాజకీయంగా లబ్ధి పొందింది బీజేపీనేనని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన జనగామలో మాట్లాతుడూ.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణలో ఓట్ల తొలగింపుపై సమగ్ర విచారణ జరిపి, తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 95 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చారని, తొలి దశలో 73 లక్షల ఓట్లు, రెండో దశలో మరో 21 లక్షల ఓట్లు తొలగించారని పల్లా ఆరోపించారు. అనేక నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. పేర్లలో అక్షరదోషాలు, ఇంటిపేర్లలో తేడాలు, వివరాలు సరిపోలకపోవడం వంటి కారణాలతో అర్హులైన వారి ఓట్లను సైతం తొలగించారని విమర్శించారు. నోటీసులకు స్పందించలేదనే కారణంతో ఓటు హక్కును తొలగించడం సరికాదన్నారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని ఆరోపించిన పల్లా.. ఆయనను పదవి నుంచి తొలగించి, ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


