తెరమీరితే మసక తప్పదు! | - | Sakshi
Sakshi News home page

తెరమీరితే మసక తప్పదు!

Oct 8 2026 1:06 AM | Updated on Oct 8 2026 1:06 AM

జాగ్రత్తలు ఇవి..

సరైన జీవనశైలితో చూపును కాపాడుకోవచ్చు

జనగామ: కంటి చూపు మనిషికి ఓ వరం.. రోజువారీ జీవితంలో సెల్‌ఫోన్‌, కంప్యూటర్‌, టీవీ వినియోగం పెరగడం, మారుతున్న జీవనశైలి, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యల కారణంగా కంటి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. మరోవైపు చిన్నారుల్లోనూ దృష్టి లోపాలు గుర్తించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. కంటి ఆరోగ్యంపై ప్రభుత్వం జనరల్‌ ఆస్పత్రి నేత్ర వైద్య నిపుణులు అవగాహన కల్పిస్తున్నా రు. ఈనెల 8న (గురువారం) ప్రపంచ దృష్టి దినో త్సవాన్ని నిర్వహిస్తున్నారు.

స్క్రీన్‌ టైమ్‌తో సమస్యలు

మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర డిజిటల్‌ పరికరాలను ఎక్కువసేపు చూడటం వల్ల కళ్లు పొడిబారడం, మంట, దురద, నీరు కారడం, తలనొప్పి, తాత్కాలికంగా చూపు మసకబారడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నారులు, విద్యార్థులు స్క్రీన్‌కు ఎక్కువ సమ యం కేటాయించకుండా తల్లిదండ్రులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.

మధుమేహంతో..

మధుమేహం ఉన్నవారిలో కంటి వెనుక భాగంలోని రెటీనాపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అందువల్ల మధుమేహ బాధితులు చూపు బాగానే ఉందని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి. కంటి ఒత్తిడి, కంటి శుక్లాలు, రెటీనా సంబంధిత వ్యాధులను సైతం ముందుగానే గుర్తిస్తే చికిత్సతో చూపును కాపాడుకునే అవకాశాలు మెరుగుపడతాయి.

చిన్నారుల విషయంలో అప్రమత్తత

పిల్లలు పుస్తకం లేదా మొబైల్‌ను కళ్లకు దగ్గరగా పెట్టుకోవడం, తరచూ కళ్లను రుద్దడం, టీవీని దగ్గరగా చూడడం, తరగతి గదిలో బోర్డుపై అక్షరాలు కనిపించకపోవడం వంటి లక్షణాలను తల్లిదండ్రులు గమనించాలి. పాఠశాల స్థాయిలో కంటి పరీక్షలు నిర్వహించి దృష్టి లోపాలను తొలిదశలో గుర్తిస్తే చదువులో వెనుకబడకుండా చూడవచ్చు.

నిర్దిష్ట వ్యవధిలో కంటి పరీక్షలు చేయించుకోవాలి.

మొబైల్‌, కంప్యూటర్‌ వినియోగంలో మధ్యమధ్యలో కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి.

పౌష్టికాహారం తీసుకోవాలి.

కళ్లను మురికి చేతులతో రుద్దకూడదు.

వైద్యుల సూచన లేకుండా కంటి చుక్కలు వాడకూడదు.

మధుమేహం, రక్తపోటు ఉన్నవారు కంటి పరీక్షలను నిర్లక్ష్యం చేయకూడదు.

డిజిటల్‌ స్క్రీన్‌ చూస్తున్నప్పుడు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలోని వస్తువును 20 సెకన్ల పాటు చూడాలి.

కంప్యూటర్‌ స్క్రీన్‌ను కంటి స్థాయి కంటే 15–20 డిగ్రీలు దిగువగా, 50 నుండి 70 సెంటీమీటర్ల దూరంలో అమర్చుకోవాలి.

గదిలో వెలుతురు సరిగ్గా ఉండేలా చూసుకో వాలి. స్క్రీన్‌ గ్లేర్‌ను తగ్గించే ఫిల్టర్లు వాడాలి.

వైద్యులు సూచించిన కళ్లద్దాలను క్రమం తప్పకుండా వాడాలి. సరైన దృష్టి సామర్థ్యం పనిలో ఉత్పాదకతను 22శాతం పెంచుతుంది.

కంటి ఆరోగ్యంపై నిర్లక్ష్యం వీడాలి

స్క్రీన్‌ టైమ్‌ తగ్గించుకుంటేనే ‘చూపు’ పదిలం

ముందస్తు పరీక్షలతోనే రక్షణ

నేడు ప్రపంచ దృష్టి దినోత్సవం

కంటి సంబంధిత అనేక వ్యాధులను ప్రారంభ దశలో గుర్తించి చికిత్స అందిస్తే చూపును కాపాడుకోవచ్చు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కంటి సమస్యలను చిన్నవిగా భావించి వైద్యులను సంప్రదించకపోవడం, అద్దాల అవసరం ఉన్నా వినియోగించకపోవడం వంటి కారణాలతో సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. చూపు ఉన్నంత వరకు దాని విలువ తెలియకపోవచ్చు. చూపు పోయిన తర్వాత దాని ప్రాధాన్యం తెలుస్తుంది. అందుకే కంటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు పరీక్షలు, సరైన జీవనశైలితో చూపును కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.

– డాక్టర్‌ రాజు, కంటి వైద్య నిపుణులు, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి, జనగామ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement