ఆర్టీసీలో హోరాహోరీ! | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో హోరాహోరీ!

Oct 7 2026 1:16 AM | Updated on Oct 7 2026 1:16 AM

జనగామ: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో కార్మిక సంఘాల ఎన్నికల సందడి ఊపందుకుంది. రెండు జేఏసీలు బరిలో నిలవడంతో పోటీ రసవత్తరంగా మారింది. 400 మంది కార్మికుల ఓట్లే ఫలితాన్ని నిర్ణయించనున్న నేపథ్యంలో నాయకులు ఒక్కో ఓటరును కలిసి మద్దతు కోరుతున్నారు. ప్రచారం, హామీలు, వ్యూహాలతో డిపో పరిసరాలు కోలాహలంగా మారాయి.

ఎన్నికల సందడి..

ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల నేపథ్యంలో డిపోలో సందడి నెలకొంది. సుదీర్ఘ విరామం తర్వాత యూనియన్లకు ఎన్నికలు నిర్వహిస్తుండటంతో కార్మిక సంఘాలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. డిపో పరిధిలో ప్రధానంగా రెండు జేఏసీల మధ్య పోటీ నెలకొంది. ఒకవైపు ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ), నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (ఎన్‌ఎంయూ), తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ) కలిసి జేఏసీగా ఏర్పడి బరిలో నిలిచాయి. మరోవైపు తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ (టీడబ్ల్యూయూ), స్టేట్‌ వర్కర్‌ యూనియన్‌ (ఎస్‌డబ్ల్యూయూ) కలిసి జేఏసీగా పోటీ చేస్తున్నాయి.

ఓటర్లే కీలకం

డిపో పరిధిలో మొత్తం 400 ఓట్లు ఉండగా.. ఈ ఓట్లే రెండు వర్గాల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. ఈయూ జేఏసీ తరఫున సెక్రటరీగా వి.ఎస్‌.ఆర్‌.రెడ్డి, అధ్యక్షుడిగా ఎ.శ్రీనివాస్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎం.బాలరాజు పోటీ చేస్తున్నారు. టీడబ్ల్యూయూ జేఏసీ తరఫున సెక్రటరీగా ఎల్‌.ఎల్‌.పతి, అధ్యక్షుడిగా ఎం.బి.కె.రెడ్డి, రాష్ట్ర కార్యదర్శిగా గిరిమల్ల రాజు, డిపో చైర్మన్‌గా కుర్ర సురేందర్‌ బరిలో ఉన్నారు.

ఓటు కోసం ముమ్మర ప్రచారం

ఎన్నికలకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రచారం ఊపందుకుంది. గత కొద్ది రోజులుగా ఇరు వర్గాల నాయకులు డిపో ప్రధాన గేటు వద్ద ప్రచారం నిర్వహించడంతోపాటు ప్రతీ కార్మికుడిని వ్యక్తిగతంగా కలిసి మద్దతు కోరుతున్నారు. తమ సంఘాన్ని గెలిపిస్తే కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏం చేస్తారు.. ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తారు.. గతంలో సంఘం చేసిన కార్యక్రమాలేమిటి వంటి అంశాలను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

గత వైభవం కోసం పోటీ

గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీలో కార్మిక సంఘాల కార్యకలాపాలు నిలిచిపోవడంతో సుదీర్ఘకా లం తర్వాత మళ్లీ యూనియన్ల పునరుద్ధరణ, వెంటనే ఎన్నికలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో కార్మిక సంఘాలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. గతంలో తమకున్న ప్రాధాన్యాన్ని తిరిగి సాధించడంతోపాటు కార్మికుల సమస్యలపై బలమైన వాణి వినిపించేందుకు ఎన్నికల్లో గెలుపు అవసరమని భావిస్తున్నాయి.

9న పోలింగ్‌.. అదే రోజు ఫలితం

ఈ నెల 9న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అనంతరం అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసిన ఇరువర్గాలు ప్రతి ఓటరును కలిసి తమ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాయి.

ఆర్టీసీ డిపో ఎదుట ప్రచారం చేస్తున్న ఈయూ కార్మిక సంఘం నాయకులు

టీడబ్ల్యూయూ కూటమి శిబిరంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బాలమణి, కౌన్సిలర్‌ కరుణాకర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు వెంకన్న తదితరులు

రాజకీయ రంగు

ఆర్టీసీ యూనియన్‌న ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సైతం ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములు కావడంతో పోటీ మరింత వేడెక్కింది. ప్రచార తీరు స్థానిక సంస్థల ఎన్నికలను తలపిస్తోంది. ఎలాగైనా పట్టు సాధించి విజయం సాధించాలని ఇరువర్గాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ చివరి నిమిషం వరకు ఒక్క ఓటును కూడా వదులుకోకుండా ప్రచారం సాగిస్తున్నాయి.

ఊపందుకున్న కార్మిక సంఘాల ఎన్నికల పోరు

జనగామ డిపోలో

ఈయూ వర్సెస్‌ టీడబ్ల్యూయూ

జేఏసీగా బరిలో నిలిచిన సంఘాలు

యూనియన్‌ పగ్గాల కోసం

జోరు ప్రచారం

9న పోలింగ్‌.. అదే రోజు కౌంటింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement