రేపు ‘వేద’లో స్వర్ణ ప్రాశన
జనగామ: కొడిమల సత్తిరెడ్డి జ్ఞాపకార్థం వేద ఆయుర్వేదిక్ పంచకర్మ వెల్‌నెస్ సెంటర్ ఆధ్వర్యంలో ఈనెల 5న ఉచిత స్వర్ణప్రాశన శిబిరం నిర్వహించనున్నట్లు డాక్టర్ అంజిరెడ్డి శనివారం తెలిపారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు హైదరాబాద్ రోడ్డులో ఏకశిల బీఈడీ కళాశాల ఎదురుగా ఉన్న వేద ఆస్పత్రిలో శిబిరం జరుగుతుందన్నారు. 6 నెలల నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు స్వర్ణప్రాశన అందించనున్నట్లు తెలిపారు. పిల్లల శారీరక, మానసిక వికాసం, జీర్ణశక్తి, కండరాలు, ఎముకల పటిష్టతకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
గ్రాడ్యుయేట్లు ఓటరుగా నమోదు చేసుకోవాలి
బచ్చన్నపేట: గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరుగా నమోదు చేసుకోవాలని రైతు బంధు సమితి జిల్లా మాజీ కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి అన్నారు. శనివారం గంగాపూర్ గ్రామంలో పట్టభద్రులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. సర్పంచ్ జిల్లెల్ల భాస్కర్‌రెడ్డి, ఉప సర్పంచ్ సదానందం, పట్టభద్రులు పాల్గొన్నారు.
జఫర్‌గఢ్: పట్టభద్రులు బాధ్యతగా ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పల్లెపాటి జైపాల్‌రెడ్డి కోరారు. పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని బాలాజీ ఇంటర్నెంట్ సెంటర్ వద్ద శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనంతరం దరఖాస్తులను తహసీల్ధార్ కార్యాలయంలో ఆర్‌ఐ దేవేందర్‌కు అందజేశారు.
సన్నాహక సమావేశం
స్టేషన్‌ఘన్‌పూర్: రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులందరూ విధిగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు గాదె పృథ్వీ అన్నారు. ఘన్‌పూర్ డివిజన్‌కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని శనివారం నిర్వహించారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి’
దేవరుప్పుల: మోసపూరిత వాగ్దానాలతో ప్రజాపాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టభద్రులు తమ ఓటుతో గుణపాఠం చెప్పాలని ఉస్మానియా విద్యార్థి జేఏసీ నేత ఇప్ప పృథ్వి రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో అర్హులు తమ పేరు నమోదు చేసుకోవాలని కోరారు.
బహుజనుల రాజ్యాధికారమే బీఎస్‌పీ లక్ష్యం
స్టేషన్‌ఘన్‌పూర్: బహుజనుల ఐక్యత, రాజకీయ చైతన్యం, రాజ్యాధికార సాధనయే లక్ష్యంగా బీఎస్పీ పనిచేస్తుందని పార్టీ జిల్లా నాయకుడు జలగం ప్రవీణ్ అన్నారు. ఈనెల 9న బడంగ్‌పేట్‌లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రం శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహుజన రాజ్యాధికార సమరభేరి సభకు సంబంధించిన పోస్టర్లను ఘన్‌పూర్‌డివిజన్ కేంద్రంలో శనివారం ఆవిష్కరించారు.
ఎన్నిక
నర్మెట: బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధిగా వెల్దండకు చెందిన బొల్లం అవినాష్ నియమితులయ్యారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని అన్నారు. ఈ సందర్భంగా తన ఎంపికకు సహకరించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు హరీశ్, జిల్లా, మండల నాయకులుకు కృతజ్ఞతలు తెలిపారు.
బీజేవైఎం అధికార ప్రతినిధిగా రాజేశ్వర్‌రెడ్డి
స్టేషన్‌ఘన్‌పూర్: బీజేవైఎం జిల్లా అఽధికార ప్రతినిధిగా మండలంలోని తాటికొండకు చెందిన తౌటిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డిని నియమించినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్, బీజైవైఎం అధ్యక్షుడు అల్లబోయిన హరీశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాజేశ్వర్‌రెడ్డి ఘన్‌పూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేలా కృషి చేస్తానన్నారు.
రెడ్డి జాగృతి
మండల అధ్యక్షురాలిగా సునీతారెడ్డి
స్టేషన్‌ఘన్‌పూర్: రెడ్డి జాగృతి ఘన్‌పూర్ మండల అధ్యక్షురాలిగా మండలంలోని తానేదార్‌పల్లి గ్రామానికి చెందిన మంతెన సునీతారెడ్డిని నియమించనట్లు రాష్ట్ర అధ్యక్షురాలు పోరెడ్డి కవితారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కర్రెడ్డి రఘునందన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సునీతారెడ్డి మాట్లాడుతూ రెడ్డి కులస్తులను ఏకం చేస్తూ న్యాయమైన హక్కుల సాధనకు పనిచేస్తానన్నారు.
నియామకం
జఫర్‌గఢ్: మండలంలోని కూనూర్ గ్రామానికి చెందిన పోతోజు ఏళ్ళచారిని బీజేపీ చేతి వృత్తుల సెల్ జిల్లా కన్వీనర్‌గా నియమిస్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఏళ్లచారి మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేశ్, పార్టీ మండల అధ్యక్షుడు నగేష్‌గౌడ్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
గీత కార్మిక సంఘం కార్యవర్గం ఎన్నిక
కొడకండ్ల: రామవరం గ్రామ గీత కార్మిక సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బొమ్మగాని సోమయ్య, ఉపాధ్యక్షుడిగా గిరగాని చంద్రమౌళి, కోశాధికారిగా బాల్నె వెంకటేష్‌గౌడ్, డైరెక్టర్లుగా కునూరు పాపయ్య, సోమనర్సయ్య, శ్రీనివాస్, యాకన్న, అయిలయ్య, రవిగౌడ్‌లు ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్ గిరగాని క్రాంతికుమార్ పాల్గొని నూతన, పూర్వ కార్యవర్గాన్ని సన్మానించారు.
ఓటుహక్కు విలువైనది
బచ్చన్నపేట: ఓటు హక్కు విలువైనదని ప్రజలకు అవగాహన కల్పించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మసూద్, సీపీఎం మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఇండియా కూటమి పార్టీల అఖిల పక్ష సమాశంలో వారు మాట్లాడారు.
మార్కెట్ కమిటీ చైర్మన్‌ను కలిసిన నాయకులు
బచ్చన్నపేట: నూతనంగా ఎన్నికై న చేర్యాల వ్యవసాయ మార్కెట కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డిని పలువురు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు శనివారం కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.
క్రీడా దుస్తుల పంపిణీ
చిల్పూరు: పల్లగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులకు స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నీలిమ చెల్లెలు సారాసునందిని (ఎన్‌పీడీసీఎల్ ఏఈఈ) జ్ఞాపకార్థం రూ.20వేల విలువైన స్పోర్ట్స్ యూనిఫారాలతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఐడీ కార్డులను శనివారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం విజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
కాల్వకు గండిపెట్టడంతో పొలాలకు నష్టం
లింగాలఘణపురం: అశ్వరావుపల్లి రిజర్వాయర్ నుంచి వచ్చే ప్రధాన కాలువలో 18 ఎల్ నుంచి లింగాలఘణపురంలోని పాత చెరువులోనికి వచ్చే కాలువకు బోడబండ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి గండి పెట్టారు. దీంతో కడకంచి కొంరయ్య పొలంలో వరి పంటకు నష్టం జరిగింది. ఉదయం విషయం తెలుసుకున్న సర్పంచ్ ఎడ్ల లావణ్యరాజు జేసీబీతో కాల్వ గండిని పూడ్చి తిరిగి చెరువులోకి నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. గండి పెట్టడంతో వరికి పొలం గట్లన్నీ తెగిపోయాయని, గడ్డివాము మొత్తం తడిసిందని రైతు కొంరయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.
చెరువులో మునిగి వ్యక్తి మృతి
నర్మెట: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి చెరువులో మునిగి మృతి చెందిన ఘటన హన్మంతాపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన శనిగరం మల్లేష్ (58) కూలి పనులు చేస్తూ ఒంటరిగా జీవిస్తున్నాడు. కాగా, హన్మంతాపురం ఊర చెరువులో శుక్రవారం చేపల వేటకు వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. చెరువులో శనివారం మృత దేహాన్ని గమనించిన స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతుడి కుమారుడు నరేష్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై నైనాల నగేష్ తెలిపారు.
బైక్ అదుపుతప్పి మాజీ సర్పంచ్‌కి
తీవ్ర గాయాలు
పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలో పాలకుర్తి–సేష్టన్‌ఘన్‌పూర్ ప్రధాన రహదారిపై ఈరవెన్ను క్రాస్ రోడ్డు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదవంలో బమ్మెర మాజీ సర్పంచ్ నాగభూషణంకు తీవ్ర గాయాలయ్యాయి. నాగభూషణం పాలకుర్తి నుంచి బమ్మెరకు వెళ్తుండగా బైక్ అదుపుతప్పడంతో రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. కాగా, స్ధానికులు మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం ఆయనను తరలించారు.
జీపీ భవన నిర్మాణానికి భూమి కేటాయించండి
చిల్పూరు: గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం కోసం భూమిని కేటాయించాలని వంగాలపల్లి సర్పంచ్ భూక్య మేనకసుధాకర్, ఉప సర్పంచ్ అరూరి రవిచంద్ర కోరారు. ఈ మేరకు శనివారం ఆర్టీఓ సెక్షన్ అధికారికి వినతి పత్రం అందజేశారు. మంతెన అశోక్, చిట్యాల రాజేశ్, మంతెన కమల్, విద్యాసాగర్, ప్రజలు పాల్గొన్నారు.
ర్యాలీని విజయవంతం చేయాలి
కొడకండ్ల: సేవ్ డెమోక్రసి, ఓటు బచావో, దేశ్ బచావో కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6న మండలకేంద్రంలో చేపట్టనున్న నిరసన ర్యాలీలో ఇండియా కూటమి పార్టీల నాయకులు భాగస్వాములై విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్‌నాయక్ కోరారు. శనివారం మండలద్రంలోని పార్టీ కార్యాలయంలో సంయుక్త సమావేశం నిర్వహించి నిరసన ర్యాలీ విజయవంతంపై చర్చించారు.


