రఘునాథపల్లి: ఉపాధ్యాయుల ప్రత్యేక చొరవతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగి 220కి చేరడంతో, వసతుల కొరతతో బడి ఎదుట నో అడ్మిషన్ బోర్డు పెట్టి వార్తల్లో నిలిచిన మండలంలోని ఖిలాషాపూర్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్ పెద్దగుడి) సమస్యలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. పాఠశాలలో తీవ్రమైన మౌలిక వసతుల కొరత వేధిస్తుండటాన్ని, మంజూరైన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ శని వారం పాఠశాల కమిటీ, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు రూపొందించిన ఫ్లెక్సీ ప్రస్తుతం స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో తీవ్రంగా వైరల్ అవుతోంది.
ఫ్లెక్సీలో పేర్కొన్న ప్రధాన సమస్యలు
పాఠశాలలో 220 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కనీసం ఒక్క బాత్రూమ్ కూడా లేదు. దీంతో బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల చుట్టూ ప్రహరి లేక పోవడంతో చిన్న పిల్లల భద్రత తీవ్ర ప్రమాదంలో పడుతోంది. విద్యార్థులు తాగడానికి సరపడా స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం తక్షణమే ఏర్పాటు చేయాలని, విద్యార్థుల సంఖ్యకు తగినన్ని తరగతి గదులు లేక పోవడంతో బోధన, చదువుకు తీవ్ర విఘాతం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నిధులు మంజూరయ్యాయని అధికారులు చెప్పడమే తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు ప్రారంభం కాలేదని గ్రామస్తులు, పాఠశాల కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. మంజూరైన పనులు ప్రారంభించకపోతే కలెక్టరేట్ వద్ద శాంతియుత నిరసన చెపడతామని ఫ్లెక్సీ ద్వారాహెచ్చరించారు.
మంజూరైన పనులు వెంటనే
ప్రారంభించాలని విజ్ఞప్తి
వాట్సాప్ గ్రూపుల్లో వైరల్‌గా
పాఠశాల కమిటీ, గ్రామస్తుల ఫ్లెక్సీ


