రఘునాథపల్లి: తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించే అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమానికి మండలంలోని కంచనపల్లి గ్రామానికి చెందిన శ్రీరామదాసు భజన మండలి ఎంపికై ంది. ఈ నెల 6న తిరుమల సన్నిధిలో నిర్వహించే సంకీర్తనలో జన మండలి అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్‌స్వామి ఆధ్వర్యంలో బృందం పాల్గొననుంది. కంచనపల్లి శ్రీభక్తాంజనేయ దేవస్థానం నేతృత్వంలో గురువులు బ్రహ్మశ్రీ నాగుల నాగేశ్వరరావుస్వామి వారి మార్గదర్శకత్వంలో ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్తున్నట్లు బృందం సభ్యులు శనివారం తెలిపారు.
జగన్ మళ్లీ సీఎం కావాలని పూజలు
బచ్చన్నపేట: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండోసారి సీఎం కావాలని మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన వైఎస్ వీరాభిమాని బొడ్డు ప్రవీణ్ ప్రత్యేక పూజలు చేశారు. శనివారం యాదాద్రిభువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో ప్రవీణ్ మోకాళ్లపై ఆలయ మెట్లు ఎక్కి లక్ష్మీనర్సిహస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్‌ను మళ్లీ సీఎంను చేయడం ఖాయమన్నారు.
విరాళం
బచ్చన్నపేట: కొన్నె గ్రామంలో శ్రీ బీరప్ప కామరాతి దేవాలయ నిర్మాణానికి పలువురు దాతలు విరాళాలను అందించినట్లు కురుమ సంఘం, దేవాలయ నిర్వాహణ కమి టీ సభ్యులు తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ ఉప సర్పంచ్ చల్ల కమలాకర్ రూ.20,116లు, కొండి ఉప్పల్‌రెడ్డి రూ. 20,116 విరాళం అందించినట్లు చెప్పారు. ఆలయ నిర్మాణానికి దాతలు సహకరించాలని కోరారు.
ఆర్థికసాయం
నర్మెట: మల్కపేట తొలి సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బానోత్ లక్ష్మణ్ నాయక్ (75) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడు. కాగా, గ్రామ శాఖ అధ్యక్షుడు బానోత్ సురేష్ ఆధ్వర్యంలో శనివారం పార్టీ శ్రేణులు రూ. 10 వేలు సాయం అందించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొమురవెళ్లి దేవస్థాన కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, బాలచందర్ ఉన్నారు.
సోమేశ్వరాలయంలో ఆరుద్రోత్సవం
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం రాత్రి ఆరుద్రోత్సవ కార్యక్రమాన్ని అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య వైభవంగా నిర్వహించారు. పంచామృతాలతో సుగంధ ద్రవ్యములు, నమక చమకములతో అభిషేకం, పంచహరతులతో చేపట్టిన గర్భాలయ దీపోత్సవాన్ని భక్తులు కనులార తిలకించి తరించారు. ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, అర్చకులు పాల్గొన్నారు.
గిరిప్రదక్షిణ
బచ్చన్నపేట: కొడవటూర్‌ని స్వయంభూ శ్రీసిద్ధేశ్వరాలయ సిద్దులగుట్ట శివనామస్మరణతో మారు మెంగింది. శనివారం భక్తులు మహా గిరిప్రదక్షిణను నిర్వహించారు. ఆలయం చుట్టూ నాలుగు కిలోమీటర్లు భక్తులు ప్రదక్షిణ చేశారు. అనంతరం శివాలయంలో పుట్టు శివలింగాన్ని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించారు. సర్పంచ్ కవితమురళి, ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఈఓ వంశీ, ఆలయ ప్రధాన పూజారి ఓం నమశివాయ, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
పింఛన్లకు 892 దరఖాస్తులు
లింగాలఘణపురం: చేయూత పెన్షన్లకు మండలంలోని 21 గ్రామాల పరిధిల 892 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో 820 మంది అర్హులుగా గుర్తించినట్లు ఎంపీడీఓ శివశంకర్‌రెడ్డి తెలిపారు. 35 మంది దరఖాస్తుదారులు సరైన ఆధారాలు అందించలేదని వీంతో వీరిని హోల్డ్‌లో పెట్టామని, 37 మందిని అనర్హులుగా గురించినట్లు వివరించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఇంటికి గెజిటెడ్ హోదా కలిగిన అధికారులు విచారణ జరిపిఅర్హుల జాబితాను ప్రభుత్వానికి నివేదించినట్లు చెప్పారు.


