జనగామ: పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన వనజీవి రామయ్య స్ఫూర్తిని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు వాస్విక్ ఫౌండేషన్ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వనజీవి రామయ్య జీవితం, పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ‘వనజీవి’ చిత్రాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రదర్శించే అంశంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్యతో వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్, చిత్ర నిర్మాత నిడిగొండ నరేష్ ప్రజాపతి శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, ముఖ్యంగా యువతకు వనజీవి రామయ్య పర్యావరణ సేవలు, మొక్కల పెంపకం, ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు చిత్ర ప్రదర్శనలు నిర్వహిం చాలనే ఉద్దేశాన్ని కమిషనర్‌కు వివరించారు. గ్రామస్థాయిలో పర్యావరణ పరిర క్షణపై చైతన్యం పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడ తాయని తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ దివ్య సానుకూలంగా స్పందిస్తూ వనజీవి రామయ్య పర్యావరణ సేవలను ప్రశంసించినట్లు వారు తెలిపారు. నిడిగొండ నరేష్ ప్రజాపతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటడాన్ని అలవాటుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సహకారం అందిస్తున్న కమిషనర్ దివ్యకు నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట ఫౌండేషన్ సభ్యుడు తరిగొప్పుల నవీన్ కుమార్ పాల్గొన్నారు.


