జనగామ: జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–6లో జిల్లా మాతా, శిశు ఆరోగ్యానికి సంబంధించి పలు కీలక గణాంకాలు నమోదయ్యాయి. జిల్లాలో వందశాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరగడం విశేషం. ఇందులో 68.6 శాతం ప్రసవాలు ప్రభుత్వ వైద్య సంస్థల్లో జరిగాయి. అలాగే వందశాతం ప్రసవాలకు శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బంది సేవలు అందించారు. మొత్తం ప్రసవాల్లో సిజేరియన్ వాటా 70.2 శాతంగా నమోదైంది.
గర్భిణుల వైద్య పరీక్షల్లో పురోగతి
ఐదేళ్లలో జరిగిన ప్రసవాలను పరిశీలిస్తే 93.5 శాతం మంది తల్లులు తొలి త్రైమాసికంలోనే ప్రసవ పూర్వ పరీక్షలు చేయించుకున్నారు. వందశాతం మంది తల్లులకు గర్భధారణ సమయంలో ఏదో ఒక దశలో వైద్య సేవలు అందాయి. కనీసం నాలుగు ప్రసవ పూర్వ పరీక్షలు చేయించుకున్న వారి శాతం 84.6గా నమోదైంది. 85.1 శాతం మంది గర్భిణులు వందరోజులు లేదా అంతకంటే ఎ క్కువ కాలం ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకున్నారు.
టీకాల్లో 93 శాతం పూర్తి కవరేజీ
12–23 నెలల వయసున్న పిల్లల్లో టీకా కార్డు లేదా తల్లి జ్ఞాపకం ఆధారంగా 93 శాతం మంది పూర్తి టీకాలు పొందినట్లు సర్వేలో వెల్లడైంది. ఇదే వయసు పిల్లల్లో 93 శాతం మందికి మూడు డోసుల పోలియో, పెంటావాలెంట్ టీకాలు అందాయి. 9–35 నెలల వయసున్న పిల్లల్లో 94.2 శాతం మందికి గత ఆరు నెలల్లో విటమిన్– ఏ మోతాదు అందింది.
పిల్లల పోషణపై ఆందోళన
ఐదేళ్లలోపు పిల్లల్లో 29.2 శాతం మంది వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం, 16.5 శాతం మంది ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, 24 శాతం మంది తక్కువ బరువుతో ఉన్నట్లు సర్వే గుర్తించింది. 6–23 నెలల పిల్లల్లో కేవలం 17.9 శాతం మందికే తగిన ఆహారం అందుతున్నట్లు నమోదైంది. మరోవైపు జిల్లాలో 99.8 శాతం కుటుంబాలకు మెరుగైన తాగునీటి వనరు, 88.8 శాతం కుటుంబాల్లో కనీసం ఒకరికి ఆరోగ్య బీమా లేదా ఆర్థిక సహాయ పథకం కవరేజీ ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–6లోని 2023–24 జిల్లా గణాంకాల ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. మొత్తంగా చూస్తే సంస్థాగత ప్రసవాలు, ప్రసవ పూర్వ వైద్య సేవలు, టీకాల విషయంలో జిల్లా మంచి స్థాయిలో ఉండగా, చిన్నారుల పోషకాహారంలో మరింత మెరుగుదల అవసరమని గణాంకాలు సూచిస్తున్నాయి.
గర్భిణుల వైద్యపరీక్షల్లో
గణనీయ పురోగతి
జిల్లాలో 93 శాతం చిన్నారులకు
పూర్తి టీకాలు
జాతీయ కుటుంబ ఆరోగ్య
సర్వే–6లో వెల్లడి


