అమ్మేటోళ్లు లేరు..
రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గడ్డుకాలం..
● 90 శాతం పడిపోయిన లావాదేవీలు
● అడ్వాన్సులు ఇచ్చిన వ్యాపారులకు
వడ్డీల భారం
● అత్యవసరమైతేనే నష్టానికి ప్లాట్ల విక్రయం
జిల్లాలో ఒకప్పుడు జోరుగా సాగిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రస్తుతం తీవ్రమాంద్యాన్ని ఎదుర్కొంటోంది. భూములు, ప్లాట్ల ధరలు గతంతో పోలిస్తే తగ్గినా కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో మార్కెట్ స్తబ్ధంగా మారింది. జిల్లాలో సుమారు 1,500 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నట్లు అంచనా ఉండగా, ప్రస్తుతం సుమారు 200 మంది మాత్రమే క్రియాశీలంగా ఉన్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని వ్యవసాయ భూములు, కమర్షియల్ ప్లాట్ల వివరాలు పంచుకుంటూ వ్యాపారం కొనసాగిస్తున్నా, రెండున్నరేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వాపోతున్నారు.
–జనగామ
జిల్లాలో గతంలో ఎకరం రూ.50 లక్షల వరకు పలికిన భూమి ప్రస్తుతం రూ.30 లక్షల స్థాయికి పడిపోయినట్లు రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ధర తగ్గినప్పటికీ కొనుగోలు దారులు ముందుకు రావడం లేదు. దీంతో ధర కంటే డిమాండ్ లేకపోవడమే ప్రధాన సమస్యగా మారిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలో గతంలో గజం రూ.20 వేల వరకు పలికిన కొన్ని కమర్షియల్ ప్లాట్ల ధర ప్రస్తుతం రూ.13 వేల నుంచి రూ. 15 వేల వరకు తగ్గినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపేవారి సంఖ్య తక్కువగానే ఉంది.
గతంలో సందడి.. ఇప్పుడు వెలవెల
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రోజుకు 100 నుంచి 200 ఎకరాల వరకు వ్యవసాయ భూముల లావాదేవీలు, 50 నుంచి 70 వరకు ప్లాట్ల విక్రయాలు జరిగేవని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం అప్పటి లావాదేవీల్లో 10 శాతం కూడా జరగడం లేదని పేర్కొంటున్నారు. వ్యవసాయ భూముల ధరలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఎకరాకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, కొడకండ్ల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కమర్షియల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు గతంలో ఉన్న డిమాండ్ కనిపించడం లేదని, తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని అంటున్నారు.
భూమి నుంచి బట్టల దుకాణం వరకు ప్రభావం
రియల్ ఎస్టేట్ రంగం కేవలం భూముల కొనుగోలు, విక్రయాలకే పరిమితం కాదు. ఈ రంగంలోకి వచ్చే డబ్బు నిర్మాణ రంగం, వస్త్ర వ్యాపారం, వాహనాలు, హార్డ్‌వేర్, సిమెంట్, ఇసుక, విద్యుత్ సామగ్రి, ఫర్నిచర్ తదితర అనేక రంగాల్లోకి ప్రవహిస్తుంది. ఇప్పుడు భూముల లావాదేవీలు తగ్గడంతో ఆర్థిక చలామణి కూడా మందగించిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, చిన్నాచితక వ్యాపారులు, నిర్మాణ రంగంపై ఆధారపడిన కార్మికులు ఆదాయాన్ని కోల్పోతుండగా, స్థిరంగా ఉన్న వ్యాపారులు సైతం వ్యాపార విస్తరణను నిలిపివేసే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు.
అప్పుడు అడ్వాన్సులు..ఇప్పుడు వడ్డీలు
భూముల ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముందుగానే భూములకు అడ్వాన్సులు చెల్లించి అగ్రిమెంట్లు చేసుకున్నారు. అయితే ఆ భూములు, ప్లాట్లు అనుకున్న సమయంలో విక్రయించకపోవడంతో ఇప్పుడు ఆర్థిక ఒత్తిడిలో చిక్కుకున్నారు. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో ఒక్కొక్కరు రూ.25 లక్షల నుంచి రూ.కోటి, రూ.2 కోట్ల వరకు అడ్వాన్సులు చెల్లించిన సందర్భాలున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. విక్రయాలు జరగకపోవడంతో పెట్టుబడిగా పెట్టిన మొత్తానికి వడ్డీలు చెల్లించడం భారంగా మారింది.
90శాతం తగ్గాయి..
గతంతో పోలిస్తే జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం 90శాతం తగ్గింది. ప్లాట్లు, వ్యవసాయ భూముల ధరలు చాలా వరకు తగ్గాయి. అయినప్పటికీ పాత ధరతో కొనుగోలు చేసిన వారు తగ్గించి అమ్మడం లేదు. కొనుగోలు చేసేవారు కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అత్యవసర సమయంలో అమ్ముకోవాల్సిన వారు మాత్రమే ఎంతో కొంత తగ్గించి అమ్ముతున్నారు.
–అలూరి రమేశ్,గౌరవ అధ్యక్షుడు,
జిల్లా రియల్ ఎస్టేట్ సంఘం
జనగామ హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ఓ వ్యక్తి గజం రూ. 5,200 చొప్పున 300కుపైగా గజాలు కొనుగోలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఇటీవల అదే ప్లాట్‌ను గజం రూ.4 వేల చొప్పున విక్రయించాల్సి వచ్చింది. దీంతో గజానికి రూ.1,200 చొప్పున నష్టం వాటిల్లింది. మరో ప్రాంతంలో గతంలో గజం రూ.23 వేలకు విక్రయమైన స్థలాన్ని కొనుగోలుదారు ఏడాది పాటు ఎదురుచూసినప్పటికీ స్పందన లేకపోవడంతో చివరకు గజం రూ.18 వేలకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీలో గజానికి రూ.5 వేల వరకు నష్టం వచ్చింది.
మార్కెట్ పూర్తిగా పడిపోతుందని భావించి వెంటనే విక్రయించే వారితో పాటు భవిష్యత్‌లో ధరలు మళ్లీ పెరుగుతాయన్న ఆశతో ప్లాట్లను అలాగే ఉంచుతున్నవారూ ఉన్నారు. దీంతో ఒకవైపు అమ్మేవారు ధర తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నా, మరోవైపు కొనేవారు భవిష్యత్ పరిస్థితులను పరిశీలిస్తూ వెనుకడుగు వేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు.


