పత్తిమొలక వాడి | - | Sakshi
Sakshi News home page

పత్తిమొలక వాడి

Aug 3 2026 1:13 AM | Updated on Aug 3 2026 1:13 AM

వరిమడి

తడారి..

నీళ్లు లేక ఎండిపోతున్న వరి పంట

వాడిపోతున్న పత్తి మొలకలు

జనగామ: రెండు రోజుల ముసురు రైతుల్లో ఆశలు నింపినా, ఆ తర్వాత ఆకాశం ముఖం చాటేయడంతో జిల్లాలో కరువు ఛాయలు స్పష్టమవుతున్నాయి. చెరువులు నిండక, భూగర్భ జలాలు అడుగంటుతూ పత్తి మొలకలు వాడిపోతుండగా, వరి పంట నీటి కోసం ఎదురుచూస్తుండడంతో అన్నదాతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. జిల్లాలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వానాకాలం సీజన్‌ ప్రారంభానికి మూడు నెలల ముందే ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం, వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే వచ్చారు. వరి, పత్తికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు వ్యవసాయ శాఖ విస్తృతంగా అవగాహన కల్పించినప్పటికీ, అధిక శాతం మంది రైతులు సంప్రదాయ పంటలైన వరి, పత్తిపైనే ఆధారపడ్డారు.

2.39లక్షల ఎకరాల్లో సాగు

జిల్లాలో ఇప్పటివరకు సుమారు 2.39 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో 1.38 లక్షల ఎకరాల్లో పత్తి, 1.13 లక్షల ఎకరాల్లో వరి, 4,777 ఎకరాల్లో కందులు, 4,895 ఎకరాల్లో మొక్కజొన్న, 900 ఎకరాల్లో పెసర్లు సాగు చేశారు. ఆరుతడి పంటలు మాత్రం 15 వేల నుంచి 20 వేల ఎకరాల మధ్యకే పరిమితమయ్యాయి. వర్షాభావం ఉంటుందనే హెచ్చరికలను పట్టించుకోకుండా నీటిపై ఆధారపడే పంటలను రైతులు అధికంగా సాగు చేయడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.

రోజురోజుకూ పడిపోతున్న భూగర్భజలాలు

గత నెల అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు కుండపోత వర్షాలు కురిసి వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులు కొంత జలకళ సంతరించుకున్నాయి. అనేక ప్రాంతాల్లో వరద పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అయితే జిల్లా మాత్రం ముసురు వర్షాలతోనే సరిపెట్టుకుంది. జిల్లాలోని 777 చెరువుల్లో ఒక్క శాతం నీరు కూడా చేరకపోవడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. దీంతో భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతుండగా, అనేక బోర్లు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ముసురు వర్షానికి ఆశపడి వేల ఎకరాల్లో వరి నాట్లు వేసిన రైతులు ఇప్పుడు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పత్తి పంటకు రెండు రోజుల ముసురు కొంత ఊరటనిచ్చినా, జూలై 30 నుంచి ఇప్పటివరకు చెప్పుకోదగ్గ వర్షం లేకపోవడం, మరోవైపు భానుడి ప్రతాపం, ఉక్కపోతతో పత్తి మొలకలు వాడిపోతున్నాయి. వరిపొలాలకు నీరు అందక మొక్కలు ఎండిపోతాయేమోనన్న భయం రైతులను వెంటాడుతోంది.

ఐదు రోజులు చిరుజల్లులే

జిల్లాలో జూలై 30 నుంచి ఆగస్టు 2 ఉదయం వరకు వర్షపాతం స్వల్పంగానే నమోదైంది. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం మొదటి మూడు రోజుల్లో తరిగొప్పుల, నర్మెట, బచ్చన్నపేట మండలాల్లో మాత్రమే తేలికపాటి జల్లులు కురిశాయి. ఆగస్టు 1, 2వ తేదీల మధ్య జిల్లాలో వర్షపాతం కొంత పెరిగి కొడకండ్లలో 9.5 మి.మీ., పాలకుర్తి గూడూరులో 8.5 మి.మీ., జనగామలో 8.3 మి.మీ., జఫర్‌గఢ్‌లో 6.3 మి.మీ. వర్షం నమోదైంది. తరిగొప్పుల, రఘునాథపల్లి, నర్మెట, స్టేషన్‌ఘన్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షాలే కురిశాయి. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు ఎక్కడా నమోదు కాలేదు.

వర్షం లోటు

జిల్లాలో జూన్‌, జూలై నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. జూన్‌లో సాధారణంగా 124.2 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా, 88.5 మి.మీ. మాత్రమే కురిసి 29 శాతం లోటు నమోదైంది. జూలైలోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పలు మండలాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. వరి, పత్తి తదితర పంటల సాగుపై ప్రభావం పడుతుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.

మురిపించిన ముసురు..

తరముకొస్తున్న కరువు

వానల కోసం రైతన్న ఎదురుచూపులు

నిండని చెరువులు.. ఎండుతున్న పంటలు

జిల్లాలో పడిపోతున్న భూగర్భజలాలు

పంటలపై ఎండదెబ్బ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement