హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, ఐఆర్‌ఎస్ అధికారి అపూర్వ సందర్శించారు. ఈ సందర్భంగా అర్చకులు వారిని ఆలయ మర్యాదలతో స్వాగతించారు. వారు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, ఆశీర్వచనం అందజేశారు.
మద్యం అమ్మకాలపై యువకుల నిలదీత
జనగామ రూరల్: మండలంలోని చౌడారం గ్రామంలో 4 నెలల క్రితం గ్రామ పంచాయతీ తీర్మానం చేసి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారు. అక్రమంగా మద్యం అమ్మితే రూ.30వేలు జరిమానా, పట్టించిన వారికి రూ.5వేల పారితోషికం అందించనున్నట్లు పంచాయతీ పాలక వర్గం తీర్మానం చేసింది. కాగా అదివారం గ్రామంలో దుర్గమ్మ పండుగ సందర్భంగా మద్యం అమ్మకాల తీర్మానం బేఖాతరు చేస్తూ గ్రామంలో కొంతమంది అనుతుమతులు లేకుండా అక్రమంగా మద్యం అమ్ముతున్నారనే విషయం తెలియడంతో గ్రామంలోని యువకులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు గ్రామానికి చేరుకొని అక్రమంగా అమ్ముతున్న సుమారు రూ.20 వేల మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. కాగా, పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలు జరపాలని వ్యక్తులు నిర్ణయం తీసుకున్నారా లేదా పాలకవర్గ అనుమతితోనే ఏర్పాటు చేశారా అని యువకులు నిలదీశారు.
‘ఓపెన్’ అడ్మిషన్లు షురూ
రఘునాథపల్లి : మండలంలోని ఖిలాషాపూర్ ఉన్నత పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అధ్యయన కేంద్రంలో 10వ తరగతి, ఇంటర్ (ఆర్ట్స్ సబ్జెక్ట్స్) ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమైనట్లు హెచ్‌ఎం భారత రవీందర్ తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లో పదో తరగతి తర్వాత చదువు మధ్యలోనే ఆపేసి 14 సంవత్సరాలు నిండిన ఆసక్తి గల విద్యార్థులు, యువత, మహిళలు ప్రవేశానికి అర్హులన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత పొంది 15 సంవత్సరాలు నిండిన డ్రాపౌట్స్ ఇంటర్ చదివేందుకు అర్హులన్నారు. ఈనెల 17వరకు ఫీజు చెల్లించి అడ్మిషన్ తీసుకోవచ్చని పేర్కొన్నారు, రూ.50 అపరాధ రుసుముతో ఈనెల 29 వరకు ఫీజు చెల్లించవచ్చని, అభ్యర్థులు తగిన ధ్రువపత్రాలతో జెడ్పీ ఉన్నత పాఠశాల ఖిలాషాపూర్ స్టడీ సెంటర్‌లో సంప్రదించాలన్నారు. వివరాలకు 99125 36316, 98497 60972 నంబర్లలో సంప్రదించాలని వారు కోరారు.
మరణానంతరం
మహోన్నత సేవ
● మెడికల్ కళాశాలకు తల్లి పార్థివదేహం అప్పగింత
జనగామ: మండలంలోని వెంకిర్యాల గ్రామానికి చెందిన చింతకింది పుష్పలీల (71 ) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మరణానంతరం కూడా సమాజానికి ఉపయోగపడాలనే ఉన్నత భావనతో కుమారుడు చింతకింది మురహరి, కుటుంబ సభ్యుల అనుమతితో పుష్పలీల పార్థివదేహాన్ని హైదరాబాద్ శామీర్‌పేటలోని ఆర్‌వీఎం మెడికల్ కళాశాలకు అప్పగించారు. వైద్య విద్యార్థులు మానవ శరీర నిర్మాణాన్ని ప్రత్యక్షంగా అధ్యయనం చేసి మెరుగైన వైద్యులుగా తీర్చిదిద్దుకోవాలని పుష్పలీల కుటుంబ సభ్యులు తీసుకున్న ఈ నిర్ణయం మానవతా దృక్పథానికి నిదర్శనంగా నిలిచింది. ఈసందర్భంగా పుష్పలీల కుటుంబ సభ్యులను స్థానికులు అభినందించారు.
శాంతించిన గోదావరి
ఏటూరునాగారం: మండల పరిధిలోని రామన్నగూడెం వద్ద మూడు రోజులుగా గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహించింది. ఈ మేరకు ఆదివారం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 14.81 మీటర్లుగా నమోదు అయ్యింది. గోదావరి వరద ఉధృతి తగ్గి దిగువకు వెళ్తుండడంతో మండలంలోని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వరద ఉధృతి తగ్గినప్పటికీ కరకట్ట వద్ద పరిస్థితి అదుపులోకి రాలేదు. మట్టి క్రమక్రమంగా ఒర్లిపోతుందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇసుక బస్తాలను వేసి మట్టిఒర్లిపోకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.


