● పలు గ్రామాల ప్రజలకు ఉపాధి
● ఆవాలను పోలిన పోపు గింజలకు
మార్కెట్‌లో గిరాకీ
● కేజీ రూ.150 పలుకుతున్న ధర
రఘునాథపల్లి: ఎండిపోయిన చెరువు, బీటలు వారిన నేల..కాని అదే చెరువు పలు గ్రామస్తులకు ఉపాధి కల్పిస్తోంది. మండలంలోని నిడిగొండ గ్రామ చెరువు పూర్తిగా ఎండిపోవడంతో చెరువు అడుగంతా చిలుక ముక్కు గింజలు (పోపు గింజలు) పండే వనంతో నిండిపోయింది. చెరువు విస్తీర్ణం 270 ఎకరాలు ఉండగా అందులో దాదాపు 175 ఎకరాల్లో చిలుక ముక్కు గింజల మొక్కలు విస్తరించాయి. ఆ గింజలను సేకరించేందుకు చాగ ల్లు, చిల్పూర్, రాజవరం, దమ్మన్నపేట, జఫర్‌గఢ్, నవాబుపేట, నెల్లుట్ల తదితర గ్రామాల నుంచి ప్రతీ రోజు మహిళలు, పురుషులు వస్తున్నారు. ఒక చేతి లో బేషన్ డబ్బా, మరో చేతిలో కర్ర పట్టుకొని మొక్కలను దులిపి గింజలను జాగ్రత్తగా సేకరిస్తున్నారు. ఒక్కొక్కరు ప్రతీ రోజు 5 నుంచి 8 కేజీల వరకు పోపు గింజలను తీస్తూ రూ.1,000 నుంచి రూ 1,200 వరకు ఆదాయం పొందుతున్నారు. సేకరించిన పోపు గింజలను ఎండబెట్టి, శుభ్రపరిచి వరంగల్ మార్కెట్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. వీటికి మార్కెట్‌లో కేజీకి రూ.150 వరకు ధర పలుకుతోంది. ఆవాలను పోలి ఉండే ఈ గింజలను చిలుక ముక్కు గింజలుగా పిలుస్తారు. మసాలా దినుసులు, ఔషధ వినియోగంలో వినియోగిస్తారు. మార్కెట్‌లో డిమాండ్ ఉండటంతో రోజువారీ ఆదాయం సమకూరుతోందని సేకరణదారులు చెబుతున్నారు.


