అర్హులమై ఉండి బిల్లులు చెల్లిస్తున్నాం
గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను వర్తింపజేయాలంటూ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నాం. దరఖాస్తుల నమోదులో జరిగిన తప్పిదాల వల్ల ఇప్పటి వరకు ఉచిత విద్యుత్ వర్తించడం లేదు. నెల నెలా బిల్లులు చెల్లించక లేక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికై నా ఉచిత విద్యుత్‌ను వర్తింపచేయాలి.
– కడారి కుమారస్వామి, తిడుగు
జఫర్‌గఢ్: తెలుపు రేషన్‌కార్డు ఉన్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గృహజ్యోతి పథకాన్ని చేపట్టినప్పటికీ అనేక మంది లబ్ధిదారులు ఈ పథకానికి నోచుకోలేకపోతున్నారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను అందించేందుకు గృహజ్యోతి పథకం పేరుతో లబ్ధిదారుల నుంచి ప్రజాపాలన ద్వారా ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దరఖాస్తులను కంప్యూటర్‌లో ఎంట్రీ చేయడంలో జరిగిన తప్పిదాలతో అనేక మంది లబ్ధిదారులకు ఈ పథకం వర్తించడం లేదు. మళ్లీ దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఏడాదిన్నర కావొస్తున్న దీనికి సంబంధించిన ఆన్‌లైన్ వెబ్‌సైట్ ఓపెన్ కాకపోవడంతో నెల నెలా విద్యుత్ బిల్లులు చెల్లించకలేక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు.
ఎంట్రీలో తప్పిదాలే శాపం..
మండలంలోని గృహ వినియోగదారుల ఒకటో కేటగిరికి సంబంధించిన విద్యుత్ మీటర్లు 10 వేల 171 ఉండగా ఇందులో 6 వేల 415 మంది గృహ వినియోగదారులకు గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతోంది. మిగతా లబ్ధిదారులు ఈ పథకానికి అర్హత ఉన్నప్పటికీ ఎంట్రీలో జరిగిన తప్పిదాలు వారికి శాపంగా మారాయి. తాము ప్రజాపాలనలో ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ గృహజ్యోతి పథకం ఎందుకు వర్తించడం లేదంటూ సంబంధిత విద్యత్ అధికారులను నిలదీస్తుండడంతో గృహజ్యోతి పథకంలో ‘మీ పేరు ఎంట్రీ’ కాలేదని ఇందుకోసం మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని అప్పటివరకు మీరు నెల నెలా విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందినేని వారు తెలపడంతో తిరిగి 880 మంది లబ్ధిదారులు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకొని ఏడాదిన్నర కావొస్తున్నా ఫలితం లేకుండా పోయింది. రోజుల తరబడి లబ్ధిదారులు కార్యాలయం చుట్టూ తిరుగుతండడంతో సమాధానం చెప్పలేక సంబంధిత అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రజాపాలనలో అధికారులు చేసిన తప్పిదాల వల్ల అర్హత ఉండి కూడ విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల తప్పిదం..
లబ్ధిదారులకు శాపం
పథకం వర్తింపజేయాలని ఎదురుచూపులు
జఫర్‌గఢ్ మండలంలో పెండింగ్‌లో
880 మంది దరఖాస్తులు


