జనగామ: ఆషాఢ మాసం మహిళల ఆధ్యాత్మికత, కుటుంబ బంధాలు, సంప్రదాయ విలువలకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన కాలం. ఈ నేపథ్యంలో పట్టణంలోని ఓ గ్రాండ్ హాల్‌లో మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బా లమణిశ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళలతో కలిసి గోరింటాకు సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలకు స్వయంగా గోరింటాకు పెట్టిన బాలమణి, ఆషాఢ మాస విశిష్టతను వివరించారు. ఇలాంటి వేడుకలు నిర్వహించడం ద్వారా మన సంస్కృతి, ఆచార వ్యవహారాలను భావితరాలకు చేరవేయడం ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. కాగా, మహిళలు ఒకరికి ఒకరు గోరింటాకు పెట్టుకుంటూ ఆషాఢ మాసానికి సంబంధించిన సంప్రదాయ పాటలు, శుభాకాంక్షలతో వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. సంబురాల్లో ప్రజాప్రతినిధులు, మహిళా కౌన్సిలర్లు, స్థానిక మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రముఖులు పాల్గొన్నారు.


