జనగామ: జిల్లాలో ప్రీ–ప్రైమరీ విద్య బలోపేతానికి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) జూలై 31న జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లాలో ప్రీ–ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లకు ఈ నెల 3 నుంచి 6 వరకు నాలుగు రోజుల సామర్థ్యాభివృద్ధి శిక్షణ నిర్వహించనున్నారు. అనంతరం 7న ప్రీ–ప్రైమరీ విభాగాలు ఏర్పాటు చేసిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఒక రోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు.
జిల్లాలో 55 ప్రీ–ప్రైమరీ స్కూల్స్
జిల్లాలో ప్రస్తుతం 55 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ–ప్రైమరీ స్కూల్స్ ఉండగా, వాటిలో 39 పాఠశాలలు తాజాగా ప్రారంభమైనవి. ఈ నేపథ్యంలో కొత్తగా నియమితులైన ప్రీ–ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లకు బోధనా నైపుణ్యాలు, చిన్నారుల అభ్యాస విధానాలు, పాఠ్య ప్రణాళిక అమలు, కార్యకలాపాల ఆధారిత బోధనపై సమగ్ర శిక్షణ అందించనున్నారు. జిల్లా విద్యాశాఖాధికారులు శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఎస్‌సీఈఆర్‌టీ ఆదేశించింది. జిల్లా విద్యాశాఖాధికారి కోర్సు డైరెక్టర్‌గా, క్వాలిటీ కో ఆర్డినేటర్లు కోర్సు కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారు. శిక్షణా కేంద్రాల ఎంపిక, జిల్లా రిసోర్స్ పర్సన్లతో ముందస్తు సమావేశాలు, ప్రత్యేక ప్రణాళికను ముందుగానే సిద్ధం చేయాలని సూచించింది. శిక్షణలో పాల్గొనే ఇన్‌స్ట్రక్టర్లు, ప్రధానోపాధ్యాయులు ఎలాంటి సెలవులు తీసుకోకుండా తప్పనిసరిగా హాజరుకావాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయ హ్యాండ్‌బుక్‌తో పాటు విద్యార్థుల వర్క్‌బుక్‌లు (భాగం–1, భాగం–2) వెంట తీసుకురావాలని పేర్కొంది. శిక్షణ పూర్తయిన అనంతరం అవసరమైన పత్రాలు, వినియోగ ధ్రువీకరణను ఎస్‌సీఈఆర్‌టీకి పంపించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
నేటి నుంచి 6వ తేదీ వరకు ఇన్‌స్ట్రక్టర్లకు శిక్షణ
7న ప్రధానోపాధ్యాయులకు
ఓరియంటేషన్
జిల్లాలో 55 ప్రీ–ప్రైమరీ స్కూల్స్


