సాక్షిప్రతినిధి, వరంగల్: పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుశాఖలో సుమారు ఏడు వేల వరకు పోస్టుల భర్తీ తక్షణ అవసరంగా గుర్తించింది. ఈ మేరకు 5,000 ఖాళీలను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు జీఓలో స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత కొంతకాలంగా నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురించాయి. వేలాది మంది నిరుద్యోగ యువత పోలీసు ఉద్యోగాల కోసం పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలకు ముందు నుంచే పోలీస్ అకాడమీ, కోచింగ్ సెంటర్లలో సందడి మొదలైంది.
ఉమ్మడి జిల్లాకు గణనీయమైన పోస్టులు
హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో పోలీసు ఉద్యోగాలు ఆశిస్తున్న వారికి నిజంగా ఇది శుభవార్తే. పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ కోసం ఉమ్మడి జిల్లా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. స్థానికత (లోకల్ కేడర్) ప్రకారం ఖాళీల వివరాలను సంబంధిత శాఖలు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు ఇప్పటికే పంపినట్లు అధికారులు ప్రకటించారు. స్థానిక కేడర్ ఆధారంగా పోస్టుల పంపిణీ జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు కూడా గణనీయమైన పోస్టులు వచ్చే అవకాశాలున్నాయని నిరుద్యోగులు భావిస్తున్నారు.
రిక్రూట్‌మెంట్ బోర్డుకు కీలక బాధ్యత..
స్థానిక కేడర్ వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, అర్హతల వివరాలను సంబంధిత శాఖలు అందించిన వెంటనే తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పూర్తి షెడ్యూల్‌తో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి నియామకంలో పోలీసు ఉద్యోగాలకు వేలాది మంది పోటీ పడుతుంటారు. ఈసారి కూడా భారీ సంఖ్యలో అభ్యర్థులు సిద్ధమవుతుండగా, పోలీసు శాఖలో కొలువుల జాతర ప్రారంభమైనట్టేనని నిరుద్యోగులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక కేడర్‌లో ఎక్కువ పోస్టులు దక్కితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వందలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, ఖాకీ డ్రెస్ కల నెరవేరే అవకాశం ఉంది.
భర్తీ చేయనున్న పోస్టులు ఇవే...
ఎస్‌ఐ (సివిల్) 148
ఎస్‌ఐ (ఏఆర్) 14
రిజర్వ్ ఎస్‌ఐ (టీజీఎస్పీ) 12
ఎస్‌ఐ (ఎస్‌ఏఆర్ సీపీఎల్) 3
అసిస్టెంట్ ఎస్‌ఐ (ఎఫ్‌పీబీ) 23
కానిస్టేబుల్ (సివిల్) 3,697
కానిస్టేబుల్ (ఏఆర్) 1,052
కానిస్టేబుల్ (ఎస్‌ఏఆర్ సీపీఎల్) 24
కానిస్టేబుల్ (డ్రైవర్) 20
కానిస్టేబుల్ (మెకానిక్) 7
మొత్తం పోస్టులు 5,000
ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో
2,138 పోస్టులు ఖాళీ
త్వరలో నోటిఫికేషన్..
నిరుద్యోగుల్లో కొత్త ఆశలు
కోచింగ్ సెంటర్లలో మొదలైన సందడి
కమిషనరేట్ / మంజూరైన పనిచేస్తున్న మొత్తం ఖాళీల
జిల్లా పోస్టులు వారు ఖాళీలు శాతం
వరంగల్ పోలీస్ కమిషనరేట్ 8,828 7,181 1,647 18.66
మహబూబాబాద్ 2,132 1,983 149 6.99
ములుగు 1,562 1,375 187 11.97
జయశంకర్ భూపాలపల్లి 1,605 1,450 155 9.66
మొత్తం 14,127 11,989 2,138 15.13


