జనగామ: వానాకాలం సాగు సీజన్‌లో ‘ఎల్‌నినో’ ముప్పు రైతులను కలవరపెడుతోంది. ఈ ఏడాది తక్కువ వర్షపాతం సూచన ఉన్న నేపద్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. వర్షపాతం లోటు ఉన్న సమయంలో సాగు చేసే క్రమంలో పంటల ఎంపిక కీలకంగా ఉంటుంది. ఎల్‌నినో ప్రభావం ఈ వానాకాలం పంటలపై పడనున్నట్లు వ్యవసాయ శాఖ హెచ్చరిస్తోంది.
ఎల్‌నినోతో ఏమి జరుగుతుంది?
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశంతో పాటు వేడి తరంగాలు పెరిగి, భూగర్భ జలాల రీచార్జ్ పడిపోయే ప్రమాదం ఉంది. వానాకాలం పంటలపై ప్రతికూల ప్రభావం ఉండవచ్చని భావిస్తోంది. అలాగే పంటల దిగుబడులు తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ రైతులను అలర్ట్ చేస్తోంది. జూన్ మాసంలో సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూలై, ఆగస్టులో పొడి జల్లులు కురిసే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం
ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేందుకు రైతులు కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, కొర్రలు, నువ్వులు తదితర వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఒకే పంటపై ఆధారపడకుండా పంట మార్పిడి చేపట్టాలని కోరుతున్నారు. జూలై 15వ తేదీ వరకు సరిపడా వర్షాలు లేకపోతే 125 రోజుల లోపు పండే స్వ ల్పకాలిక వరి రకాలను ఎంచుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది.
వ్యవసాయశాఖ సూచనలు పాటిస్తూ..
వర్షాల పరిస్థితిని గమనించి విత్తనాలు వేయండి. ఒకే పంటపై ఆధారపడ వద్దు. పంట మార్పిడి చేయాలి. తక్కువ కాలంలో పండే రకాలను ఎంచుకోవాలి. నీటి సంరక్షణ చర్యలు చేపట్టి, వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తే దిగుబడులు పెంచుకోవచ్చు.
పత్తి విత్తన ధరలు ఇలా..
2026–27 వానాకాలం సీజన్‌కు సంబంధించి పత్తి విత్తన ధరలను ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా ధరలు నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. 475 గ్రాముల బీజీ–1 రకం ఒక ప్యాకెట్‌కు గరిష్ట ధర రూ.635, బీజీ–2 రకం గరిష్ట ధర రూ.901గా ఖరారు చేశారు. అలాగే హెచ్‌టీ పత్తి సాగుకు అనుమతి లేదని, ఈ రకం పత్తి విత్తనాల ఉత్పత్తి, విక్రయం, సాగు పూర్తిగా నిషేధమని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
వరిలో సన్న రకాలు..
వానాకాలం సాగుకు అనువైన సన్న వరి రకాలను వ్యవసాయ శాఖ సూచించింది. పీజేటీఏయూ నోటిఫికేషన్ ఆధారంగా తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్ 15048/మధు మేహగ్రస్తులకు అనుకూలం), కునా రం వరి–2 (కేఎన్‌ఎం 1638, రాజేంద్రనగర్ వరి–4 (ఆర్‌ఎన్‌ఆర్ 21278/వాలిపోకుండా తట్టుకునే సామర్థ్యం ఉంది) రకాలు వానాకాలంతో పాటు యాసంగికి కూడా అనుకూలమని పేర్కొంది.
లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దే విత్తనాలు..
అనుమతి పొందిన లైసెన్స్ కలిగిన విత్తన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయడంతో పాటు బిల్లులు తీసుకోవాలి. అనుమతి లేని విత్తనాలను అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు ఉంటాయి. నకిలీ, హెచ్‌టీ రకం, ఇతర లైసెన్స్ లేని పత్తి విత్తనాలను అమ్మినా, సరఫరా చేసినా వెంటనే వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయాలి.
ఈ ఏడాది లోటు వర్షపాతం సూచన
పంటల ఎంపికలో
‘అప్రమత్తత’ తప్పనిసరి
ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో
రైతులకు అవగాహన
వరి 2.13లక్షలు
పత్తి 1.30లక్షలు
మొక్కజొన్న 13వేలు


