స్టేషన్‌ఘన్‌పూర్: ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు చదువుతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి అని స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ భీమ్‌శర్మ అన్నారు. ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో హనీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నీల రాకేష్ ఆధ్వర్యంలో కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు శనివారం సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఏసీపీ హాజరై మాట్లాడారు. విద్యార్థులు, యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. రోజురోజుకు మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో హనీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ చైర్మన్ నీల వెంకటేశ్వర్లు, డైరెక్టర్ నీల రాకేష్, కంప్యూటర్ ట్రైనర్స్ సంధ్య, చందర్, పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్
పోటీలకు ఎంపిక
జనగామ రూరల్: పట్టణంలోని స్థానిక ధర్మకంచ మినీ స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు ఎంపికై నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి మనోజ్ కుమార్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఈ ఎంపికకు సుమారు 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, ఇందులో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 11, 12 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్‌లో జరిగే 12వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి ఆవుల అశోక్, నిర్వహణ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, రంజిత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జిల్లా సహకార అధికారిగా
బాధ్యతల స్వీకరణ
జనగామ: జిల్లా సహకార అధికారిగా కె.అరుణ బాధ్యతలను స్వీకరించారు. శనివారం ఆమె సాక్షితో మాట్లాడారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోళ్లు, తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
పాము జాతులపై
అవగాహన ఉండాలి
బచ్చన్నపేట: ప్రతిఒక్కరూ పాము జాతులపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి భాస్కర్ అన్నారు. శనివారం మండలంలోని పోచన్నపేట గ్రామంలోని సెకండరీ పాఠశాలలో విద్యార్థులకు, గ్రామస్తులకు సరీసృపాల అవగాహన సదస్సు, ప్రత్యక్ష ప్రదర్శనను సర్పంచ్ ఎండీ. ఫిరోజ్‌ఖాన్ అధ్యక్షతన అటవీ శాఖ, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించారు. పాములను ప్రత్యక్షంగా చూపిస్తూ ప్రజల్లో ఉన్న భయాలను తొలగించారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్‌ఓ మాట్లాడుతూ మన ప్రాంతంలో కనిపించే నాగుపాము, కట్లపాము, పొడపాము విషమున్నవని, జెర్రిపోతు, నీటిపాము విషం లేనివన్నారు. పొరపాటున పాము కాటుకు గురైతే కంగారు పడకుండా వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి యాంటీ–వెనమ్ ఇంజెక్షన్ తీసుకో వ డం మంచిదన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు జావీద్ హుస్సేన్, రమేష్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రవీందర్‌రెడ్డి, బీట్ ఆఫీసర్లు ధర్మరాజ్, రమేష్ పాల్గొన్నారు.
కాజీపేట మీదుగా
ప్రత్యేక రైలు
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు, ప్రయాణికుల సౌకర్యార్థం బిలాస్‌పూర్–బెంగళూరు కాంట్ మధ్య వేసవి ప్రత్యేక రైలును నడిపిస్తున్నట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ ఎ.శ్రీధర్ తెలిపారు. ఈనెల 12న బిలాస్‌పూర్–బెంగళూరు కాంట్ (08263) వెళ్లే వీక్లీ ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. ఈరైలుకు భత్‌పర, రాయ్‌పూర్, దుర్గ్, వా డ్స, కాగజ్‌నగర్, మంచిర్యాల, కాజీపేట, చర్లపల్లి, సికింద్రాబాద్, మంత్రాలయం రోడ్డు తదితర స్టేషన్‌లలో హాల్టింగ్ కల్పించారు.


