● వీసీలో సీఎస్ రామకృష్ణారావు
జనగామ రూరల్: రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని, ఈనెల 9న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న మండల మహిళా సమాఖ్య ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శనివారం ధాన్యం కొనుగోళ్లు, ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ 9న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో మండల మహిళా సమాఖ్యలకు ఆర్టీసీ బస్సుల పంపిణీ కార్యక్రమానికి జిల్లాల్లోని అన్ని బస్సులు ఆయా మండలాల నుంచి మహిళా సంఘాల సభ్యులు సాయంత్రం 4 గంటల లోపు హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌కి చేరుకునే విధంగా చూడాలన్నారు. మహిళలకు మార్గమధ్యలో భోజనాలు, తాగు నీరు, మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రణాళికలు చేసుకోవాలన్నారు. నీట్ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ వీసీలో విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, డీసీఓ కరుణ, ఏసీపీ భీం శర్మ, అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, రవాణా విషయంలో నిర్లక్ష్యం వహించరాదని, రైతులు పండించే ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేసి ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలన్నారు. సమావేశంలో డీసీఓ కరుణ, అదనపు డీఆర్‌డీఓ నూరుద్దీన్, డీఎం హతిరామ్, జిల్లా మార్కెటింగ్ అధికారి రామకృష్ణ, డీసీఎస్‌ఓ సురేష్ రెడ్డి, రవాణా శాఖ అధికారి శిల్ప, వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ, తదితరులు పాల్గొన్నారు.
బస్సుల ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలి
ఈ నెల 9వ తేదీన హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో సీఎం రేవంతర్‌రెడ్డి మహిళా మండల సమాఖ్యలకు బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 9వ తేదీన హైదరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే సభకు జిల్లా నుంచి మహిళా సంఘాల సభ్యులు ఆర్టీసీ బస్సుల్లో సకాలంలో చేరే విధంగా చూడాలన్నారు. డీఆర్డీఓ భాస్కర్, ఏపీడీ నూరుద్దీన్, విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన డీఈఈసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ డైట్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ)లో ప్రవేశాలకు సెట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ శనివారం ముగిసింది. వీరు ఈ నెల 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని హనుమకొండ జిల్లా విద్యాశిక్షణ సంస్థ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ బి.రంగయ్యనాయుడు కోరారు. అధికారిక వెబ్‌సైట్ https://deecet.cdse.telangana.gov.inలో కళాశాలలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఏదైనా పొరపాటు జరిగితే 9న సవరించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. 14న మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపులు ఉంటాయని తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు డైట్ కళాశాలల్లో ఈనెల 17వ తేదీలోగా నిర్ణీత ఫీజు చెల్లించి రిపోర్టు చేయాలని కోరారు. నూతన విద్యాసంవత్సరం జూలై 1వతేదీ నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.


