లక్ష్యం.. 100శాతం | - | Sakshi
Sakshi News home page

లక్ష్యం.. 100శాతం

May 19 2026 1:40 AM | Updated on May 19 2026 1:40 AM

ఫార్మర్‌ రిజిస్ట్రీలో జిల్లాది 6వ స్థానం

జనగామ: జిల్లాలో ఫార్మర్‌ రిజిస్ట్రీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 12 మండలాల్లో 62 క్లస్టర్లు, 176 రెవెన్యూ గ్రామాల పరిధిలో 1,99,051 మంది రైతులు ఉన్నారు. వీరిలో 1,43,037 మంది రైతుల రిజిస్ట్రీ ఇప్పటివరకు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఫార్మర్‌ రిజిస్ట్రీలో సోమవారం నాటికి జనగామ జిల్లా ఆరు నుంచి ఏడో స్థానంలో కొనసాగడం విశేషం. జిల్లాలో ఇప్పటివరకు 71.86శాతంగా నమోదైంది.

సమస్య ఉన్నా..అధిగమిస్తూ

ఇటీవల భూముల కొనుగోలు, మార్పిడి చేసుకొని పట్టాదార్‌ పుస్తకాలు పొందిన పొందిన రైతుల వివరాలు కూడా ఏఈఓ లాగిన్‌లకు చేరడంతో రిజిస్ట్రీ ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది. అయితే రిజిస్ట్రీ విజయవంతంగా కొనసాగుతున్నప్పటికీ కొన్నిచోట్ల సాంకేతిక, నిర్వహణ సంబంధిత సమస్యలు ఏఈఓలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అంతేకాక రిజిస్ట్రీ ప్రక్రియలో రైతులు మూడు సార్లు ఓటీపీ అందించడం తప్పనిసరి కావడంతో, పలువురు రైతులు సహకరించకపోవటం ఆలస్యానికి దారితీస్తోంది. దీంతో పాటు మృతి చెందిన రైతుల పేర్లు కంటిన్యూ కావడం, వలస వెళ్లిన అన్నదాతలు, భూమి అమ్ముకున్న తర్వాత పేరు మార్పిడి చేసుకోలేని పట్టాదార్‌ పుస్తకాల రిజిస్ట్రీ పెండింగ్‌లో ఉండగా, దానిని సైతం అధిగమించేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఓ ప్రాంతంలో అ ధికారి 80 మంది రైతులకు ఫోన్‌ చేయగా, ఆ రోజు కేవలం 8 మంది మాత్రమే స్పందించి రిజిస్ట్రీ పూర్తి చేసుకోవడం, వ్యవస్థ ఎంత కష్టతరంగా మారిందో అర్థమవుతోంది. ఈ సమస్యలతో పాటు యాప్‌ ఓ పెన్‌ చేసే సమయంలో నెట్‌వర్క్‌ సమస్యలు, సర్వర్‌ మొరాయింపు తరచుగా ఎదురవడం కారణంగా రిజిస్ట్రీ నమోదులో ఆలస్యానికి కారణంగా చెప్పవచ్చు.

నిరంతరం సమీక్షలు..

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఫార్మర్‌ రిజిస్ట్రీని 100 శాతం పూర్తి చేయాలని, ఇందుకోసం ప్రతిరోజు మంత్రి, సీఎస్‌ జిల్లాల కలెక్టర్లతో వర్చువల్‌ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సంబంధిత అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ పురోగతిని తెలుసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని పలు వ్యవసాయ, వనరుల పంపిణీ స్కీములు ఫార్మర్‌ రిజిస్ట్రీతో అనుసంధానించే అవకాశం ఉందని తెలుస్తోంది. హార్టికల్చర్‌ శాఖలో ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉంది. ఫార్మర్‌ రిజిస్ట్రీ పూర్తయితే భవిష్యత్‌లో రైతులకు అందే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు మరింత పారదర్శకంగా, సరళంగా అందుబాటులోకి రానున్నాయి. జిల్లా వ్యవసాయ అధికారులు తక్షణమే మిగిలిన రైతులను సంప్రదించి రిజిస్ట్రీ పూర్తి చేయాలని, రైతులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఫార్మర్‌ రిజిస్ట్రీ పూర్తి కావడంతో భూమి, పంట, తదితర వాటికి సంబంధించిన రైతుల విలువైన డేటాబేస్‌ ప్రభుత్వం వద్ద సిద్ధం కానుంది.

అత్యధిక శాతం..చిల్పూరులో

జిల్లాలో అత్యధిక శాతం నమోదు చేసిన మండలం చిల్పూర్‌ (75.63శాతం) కాగా, ఆ తర్వాత దేవరుప్పుల (74.83శాతం), స్టేషన్‌ ఘన్‌పూర్‌, (74.60 శాతం), నర్మెట (73.98శాతం) మండలాలు ఉన్నాయి. జిల్లాలో అత్యల్పంగా రిజిస్ట్రీ పూర్తయిన మండలం లింగాలఘణపురం (65.10శాతం) ఉండగా, ఇది జిల్లా సగటు కంటే 6.7 శాతం పాయింట్లు తక్కువగా ఉంది.

సమస్య ఉన్నా..శ్రమిస్తున్న అధికారులు

నమోదులో అత్యధికం చిల్పూరు..అత్యల్పం లింగాలఘణపురం

జిల్లాలో 71.86 శాతం రిజిస్ట్రీ పూర్తి

జిల్లాలో ఫార్మర్‌ రిజిస్ట్రీ సమాచారం

మండలం రైతులు పూర్తయినవి శాతం

బచ్చన్నపేట 19,589 14,153 72.25

చిల్పూరు 14,213 10,750 75.63

దేవరుప్పుల 18,453 13,811 74.83

స్టే.ఘన్‌పూర్‌ 15,655 11,679 74.60

జనగామ 17,949 12,406 69.12

కొడకండ్ల 10,902 7,962 73.03

లిం.ఘణపురం 18,035 11,741 65.10

నర్మెట 11,473 8,488 73.98

పాలకుర్తి 24,402 17,884 73.29

రఘునాథపల్లి 22,729 16,093 70.80

తరిగొప్పుల 8,984 6,427 71.54

జఫర్‌గఢ్‌ 16,664 11,643 69.87

మొత్తం 1,99,051 1,43,037 71.86

Advertisement
 
Advertisement
Advertisement