ప్రజాసమస్యలకే ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజాసమస్యలకే ప్రాధాన్యం

Mar 24 2026 8:02 AM | Updated on Mar 24 2026 8:02 AM

త్వరితగతిన పరిష్కరించాలి

గ్రీవెన్స్‌లో అధికారులకు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశం

207 దరఖాస్తుల స్వీకరణ

జనగామ రూరల్‌: ఏ దిక్కు లేని అనాథను కరుణించాలని, తన పిల్లలతో అనాథాశ్రమంలో ఉంటున్నానని తనకు ఇందిరమ్మ ఇల్లు, వితంతు పెన్షన్‌ ఇప్పించాలని ఓ మహిళ, మొరం తరలింపుతో రోడ్డు దెబ్బతింటోందని ఓ వ్యక్తి, అల్లుడు తమ భూమిని ఆక్రమించాడని ఓ కుటుంబం..ఇలా పలు సమస్యలతో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో కలెక్టర్‌ వివిధ గ్రామాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 207 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని, సమస్యలను త్వరితగతిన పరిష్కరించి వారికి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బెన్‌ షాలోమ్‌, వివిధ శాఖల అధికారులు, వివిధ సెక్షన్‌ల సూపరింటెండెంట్‌లు పాల్గొన్నారు.

వినతుల్లో కొన్ని..

● కొడకండ్ల గ్రామానికి చెందిన బంగారు మల్లికార్జున్‌, తండ్రి సోమయ్య ఇంతవరకు ఎలాంటి ప్రభుత్వ పథకాలను మంజూరు చేయలేదని వృద్ధాప్య పింఛన్‌తో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు.

● చిల్పూరు మండలం లింగంపల్లికి చెందిన రమేశ్‌ తండ్రి వెంకటయ్య.. పేరున సర్వే నెం, 343లో 17 ఎకరాల 33 గుంటల భూమి ఉందని, అందులో నుంచి 15 ఎకరాల 39 గుంటల భూమిని ఇతరులకు అమ్మినట్లు, మిగతా భూమిని వారత్వం కింద తన పేరు మీద మార్చి పట్టా ఇప్పించాలని వినతి పత్రం అందించారు.

● బచ్చన్నపేట గ్రామానికి చెందిన బేతి మాధవి ఆమె భర్త మురళి మృతి చెందారని, తాను నిరుపేదనని కుటుంబం గడవక ఇబ్బందులు పడుతున్నామని, తనకు వితంతు పింఛన్‌ మంజూరు చేయాలని వేడుకుంది.

● స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండంలోని ఇప్పగూడెం దేవాదుల కాల్వవెంట ఉన్న మొరాన్ని అక్రమంగా జేసీబీలతో టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారని దీంతో బీటీ రోడ్డు తెబ్బతింటోందని స్టేషన్‌ ఘన్‌పూర్‌కు చెందిన తోట రమేశ్‌ వినతి పత్రం అందించారు. తరలించిన మొరం పట్టణంలో ఓ ప్రాంతంలో డంప్‌ చేసి విక్రయిస్తున్నారని అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

● తన పేరు మీద సర్వే నెంబర్‌ 535లో 2ఎకరాల 8 గుంటల భూమి ఉందని, తన అల్లుడు తనకు తెలువకుండా మాయమాటలు చెప్పి అక్రమంగా పట్టాచేసుకున్నాడని కొడకండ్ల మండలం పలుగుల తండాకు చెందిన జాటోతు దాలి విన తి పత్రం అందించారు. ఆ పట్టా రద్దుచేసి తన పేరున పట్టా చేసి ఆదుకోవాలని వేడుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement