జనగామ: వరి సేకరణలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అసెంబ్లీలో సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో రైతులకు చెల్లించాల్సిన బోనస్, బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించడంలో ఆలస్యంతో మార్కెట్ ధర క్వింటాల్ ధాన్యానికి రూ.1,600 నుంచి రూ.1,700 వరకు పడిపోయిందన్నారు. సీఎం ప్రకటించిన రూ.1800 ధర సరిపోదని, వాస్తవానికి రూ.2400 కాగా, దీనికి బోనస్ కలిపితే రూ.2900 వరకు రావాల్సి ఉందన్నారు. ధాన్యం కొనుగోలు సెంటర్లను సకాలంలో ప్రారంభించాలని కోరారు. గత యాసంగి సీజన్‌కు సంబంధించిన రూ.12,800 కోట్ల బోనస్ బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని, ఆ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.
బుగులు వెంకన్న హుండీ ఆదాయం రూ.4.66లక్షలు
చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీలను సోమవారం కొడవటూరు దేవాలయ ఈఓ చిందం వంశీ ఆధ్వర్యంలో చైర్మన్ శ్రీధర్‌రావు, ఈఓ లక్ష్మిప్రసన్న సమక్షంలో లెక్కించారు. 75 రోజలకుగాను రూ. 4,66,496ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు రవీందర్‌శర్మ, రంగచార్యులు, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్, ధర్మకర్తలు గోలి రాజశేఖర్, ఎడ్ల యాదగిరి, గణగోని రమేశ్, దారం రాజన్‌బాబు, రత్నాకర్‌రెడ్డి ,రాజరాజేశ్వరి సమితీ సభ్యులు పాల్గొన్నారు.
33 కేవీ లైన్ల జీఐఎస్ డిజిటలైజేషన్ ప్రారంభం
జనగామ: జిల్లాలోని విద్యుత్ శాఖ పరిధిలో ఎన్పీడీసీఎల్ సీఎండీ ఆదేశాల మేరకు జీఐఎస్ అసెట్ మ్యాపింగ్ అండ్ ట్రాకింగ్ ప్రక్రియ వేగవంతంగా ప్రారంభమైందని ఎస్‌ఈ సంపత్ రెడ్డి తెలిపారు. సోమవారం ఎస్‌ఈ మాట్లాడుతూ.. 33 కేవీ లైన్లకు చెందిన 44 ఫీడర్లను డిజిటలైజేషన్‌లోకి తీసుకువచ్చే కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ కొత్త వ్యవస్థ ద్వారా ప్రతీ విద్యుత్ స్తంభం వారీగా పెట్రోలింగ్ నిర్వహించడం మరింత సులభమవుతుందని తెలిపారు. నిర్వహణ పనులు, ట్రాన్స్‌ఫార్మర్ వైఫల్యాలు, గతంలో చోటుచేసుకున్న విద్యుత్ అంతరాయాలకు సంబంధించిన వివరాలు వంటి కీలక సమాచారాన్ని రియల్‌టైమ్‌లో ట్రాక్ చేసుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే ఆ ప్రాంతంలోని పోల్ నెంబర్ ఆధారంగా వెంటనే లొకేషన్ మ్యాపింగ్ తెలుసుకొని తక్షణమే సిబ్బంది అక్కడికి చేరుకునే విధంగా వ్యవస్థ ఉపయోగపడుతుందని సంపత్‌రెడ్డి వివరించారు. జీఐఎస్ డిజిటలైజేషన్ వ్యవస్థతో ఫీడర్ల పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా మారి, స్పందనా వేగం పెరిగి, విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గే అవకాశముందని ఎస్‌ఈ చెప్పారు.
రైతుల ఖాతాల్లోకి
‘భరోసా’ డబ్బులు
జనగామ రూరల్: జిల్లాలో 2025–26 యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ విజయవంతంగా పూర్తయిందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు మొత్తం (12) మండలాల్లోని (176) గ్రామాల పరిధిలో గల (1,79,936) మంది రైతులకు లబ్ధి చేకూరినట్లు పేర్కొన్నారు. ఈ విడతలో మొత్తం 91,99,03,173 రైతుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పారదర్శకంగా ఈ ప్రక్రియను ముగించామని తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం సంబందించిన బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు.


