● గ్యాస్ కొరతతో భారీ డిమాండ్
● డిస్ట్రిబ్యూటర్ల వద్ద నో స్టాక్
● ఆర్డర్ ఇచ్చి 15 రోజులు గడుస్తున్నా దొరకట్లే
● 12 రోజులుగా సరఫరా నిలిచిన కమర్షియల్ సిలిండర్లు
జనగామ: జిల్లాలో కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో గ్యాస్ మార్కెట్‌లో తీవ్రమైన అనిశ్చితి నెలకొంది. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ స్థాయిలో గ్యాస్ ధరలు, సరఫరాలో ఊహించని మార్పులు చోటుచేసుకోవడంతో జిల్లా ప్రజలు ముందస్తు జాగ్రత్తల పేరుతో గ్యాస్ బుకింగ్‌లను భారీగా పెంచుతున్నారు. సబ్సిడీ సిలిండర్లకు పెద్దగా కొరత లేకున్నా.. గ్యాస్ ఏజెన్సీల వద్ద బుకింగులు పెరగడంతో డెలివరీలపై భారం ఎక్కువవుతోంది.
జిల్లాలో 1.60లక్షల కనెక్షన్లు..
జిల్లాలో మొత్తం 12 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా సబ్సిడీ సిలిండర్ల సంఖ్య 1,60, 016గా ఉంది. పట్టణంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ పరిధిలో ప్రస్తుతం నాలుగు వేల పైచిలుకు బుకింగ్‌లు పెండింగ్‌లో ఉండగా, ఇతర మండలాల పరిధిలో ఒక్కో ఏజెన్సీకి 400 నుంచి 500 వరకు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
జిల్లాకు కమర్షియల్ సిలిండర్ల సరఫరా 12 రోజులుగా నిలిచిపోయినప్పటికీ, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లలో ఇంకా కనిపించడం సందేహాలను రేకెత్తిస్తోంది. సరఫరా నిలిచిపోయిన పరిస్థితుల్లో ఈ సిలిండర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సబ్సిడీ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు చేసి పెద్ద సిలిండర్లలోకి మిషన్ల సాయంతో నింపుతున్నారన్న ప్రచారం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం పట్టణంలోని పలు హోటళ్లలో వంటకు కమర్షియల్ సిలిండర్లతో పాటు కట్టెల పొయ్యిలను కూడా వినియోగిస్తున్నారు. కమర్షియల్ గ్యాస్, ఎలక్ట్రిక్ స్టవ్‌ల కొరత, ధరల పెరుగుదల అన్నీ కలిసి జిల్లాలో ఇంధన పరిస్థితిపై ఊహించని ఒత్తిడిని పెంచుతున్నాయి. గృహ వినియోగ సబ్సిడీ సిలిండర్ల కొరత లేకున్నప్పటికీ, కొరత వస్తుందనే ఆందోళన, భయంతో ప్రజలు ముందస్తు చర్యలతో గ్యాస్ మార్కెట్‌ను మరింత అతలాకుతలం చేస్తోంది.


