
విధుల్లో నిర్లక్ష్యం వద్దు
లింగాలఘణపురం: సీజనల్ వ్యాధులపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, ఆరోగ్య కేంద్రాల సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ రిజ్వాన్‌బాషా తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి ఎవరెవరు విధుల్లో ఉన్నారనే అటెండెన్స్ తీసుకున్నారు. ఓపీ రిజిస్టర్, ల్యాబ్ టెక్నీషియన్ రిపోర్టును పరిశీలించారు. సిబ్బంది, ఏఎన్‌ఎంలతో సమీక్షించారు. ఎంసీహెచ్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అశోక్‌కుమార్, టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ కమల్, స్వర్ణలత, సలీమాబేగం, శ్రవంతి, సిబ్బంది ఉన్నారు. అనంతరం జీడికల్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. ఇసుక అధిక ధరకు విక్రయిస్తున్నారని తెలపడంతో అధికారులు ఏం చేస్తున్నారని పంచాయతీ సెక్రటరీ మల్లేశంను ప్రశ్నించారు. ఇసుక ట్రాక్టర్ యజమానులపై చర్య తీసుకోవాలని తహసీల్దార్ రవీందర్‌ను ఆదేశించారు. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లూటంగ్ వ్యాధి నివారణకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఉన్నత పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. యూనిఫాం, పాఠ్య, నోట్ పుస్తకాలు ఇచ్చారా లేదా అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. లక్ష్యంతో చదవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ భోజన్న, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ రఘురామకృష్ణ, ఎంఈఓ విష్ణుమూర్తి, హెడ్మాస్టర్ సబిత తదితరులు ఉన్నారు.
సీజనల్ వ్యాధులపై ప్రభుత్వం సీరియస్
కలెక్టర్ రిజ్వాన్ బాషా