
హామీ నెరవేర్చకుంటే రాజీనామా చేయాలి
జనగామ రూరల్: హామీ నెరవేర్చకపోవడం చేతకాకుంటే సీఎం రాజీనామా చేయాలని, పెన్షన్ పెంపుదలపై రేవంత్ సర్కారు దగా చేస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అన్నారు. వీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం సోమరాజు అధ్యక్షత జిల్లా కేంద్రంలోని జూబ్లీ ఫంక్షన్‌హాల్‌లో చలో హైదరాబాద్ పెన్షన్‌దారుల గర్జన సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంద కృష్ణ హాజరై మాట్లాడుతూ దివ్యాంగుల పెన్షన్ రూ.6000, వృద్ధులు, వితంతువుల చేయూత పెన్షన్ రూ.4000 వ రకు పెంచుతామని ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని గుర్తుచేశారు. అందాల పోటీలు, భూస్వాములకు రైతుభరోసా, అభివృద్ధి పేరుతో వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు, పెన్షన్ పెంచకుండా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైన ప్రతిపక్ష, విపక్ష పార్టీలు మౌనం వీడాలని సూచించారు. ఆగస్టు మొదటి వారంలోపు 15 డిమాండ్లు తీర్చకపోతే హైదరాబాద్‌లో లక్షలాది మంది పింఛన్‌దారుల శక్తి ప్రభుత్వానికి చూపిస్తామని హెచ్చరించారు. వీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి రు నగేష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఈగ చక్రపాణి, ధరావత్ స్వామి నాయక్, జిల్లా గౌరవ అధ్యక్షుడు తిప్పారపు బాలయ్య, ఇన్‌చార్జ్ బోడ సునీల్ మాదిగ, గండి యాదగిరి, కృష్ణమూర్తి, బిచ్చల వంశీ, జ్యోతి, కిశోర్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
మంద కృష్ణమాదిగ