‘బెల్ట్‌’ కోసం పోటాపోటీ..! | - | Sakshi
Sakshi News home page

‘బెల్ట్‌’ కోసం పోటాపోటీ..!

Oct 12 2026 3:49 AM | Updated on Oct 12 2026 3:49 AM

మెట్‌పల్లిరూరల్‌: పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా బెల్ట్‌ షాపులు జోరందుకున్నాయి. ఏ మూలచూసినా మద్యం లభిస్తోంది. ఏటేటా బెల్ట్‌షాపుల ఏర్పాటుకు డిమాండ్‌ పెరుగుతోంది. ఏడాదిపాటు అగ్రిమెంట్‌ ఉండేలా రూ.లక్షల్లో వేలం పాడి షాపులను దక్కించుకుంటున్నారు. వీటికి వీడీసీలు వంత పాడుతుండడంతో డిమాండ్‌ మరింత పెరుగుతోంది. గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేపడుతున్నా.. ఎమ్మార్పీ కన్నా అదనంగా వసూలు చేస్తున్నా ఎకై ్సజ్‌ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఇటీవల మెట్‌పల్లి ఎకై ్సజ్‌ సర్కిల్‌ పరిధిలోకి నూతనంగా వచ్చిన అధికారులు దాబాల వద్దకు వెళ్లి మూసివేయాలని నిర్వాహకులకు సూచిస్తున్నారు. లేనిపక్షంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు తెలిసింది. కానీ బెల్ట్‌షాపులపై మాత్రం కన్నెత్తి చూడడంలేదు.

బెల్ట్‌షాపులే కేంద్రంగా దందా..

గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. బెల్ట్‌షాపులే కేంద్రంగా దందా జోరుగా సాగుతోంది. అనధికారికంగా ఏర్పాటు చేసిన బెల్ట్‌షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. మెట్‌పల్లి మండలంలో ఒక్కో గ్రామంలో రెండు నుంచి మూడు బెల్ట్‌షాపులు ఉన్నాయి. కిరాణదుకాణాలు, చికెన్‌ సెంటర్లను అడ్డగా చేసుకొని మద్యాన్ని అమ్ముతున్న నిర్వాహకులు మద్యం బాటిళ్లపై అదనంగా రూ.10 నుంచి రూ.20 వరకు వసూలు చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచే మద్యం లభిస్తోందంటే బెల్ట్‌షాపులు ఏ మేరకు నడుస్తున్నాయో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అధికారికంగా నిర్వహించే వైన్స్‌షాపుల్లో సమయానుసారంగా మద్యం లభిస్తుండగా.. బెల్ట్‌షాపుల్లో మాత్రం ఎప్పుడంటే అప్పుడు లభిస్తోంది.

వేలంలో రూ.3 లక్షలు పలికిన బెల్ట్‌షాపు

మెట్‌పల్లి మండలం ఆత్మనగర్‌ గ్రామంలో బెల్ట్‌షాపు నిర్వహణ కోసం వీడీసీ ఆధ్వర్యంలో ఆదివారం వేలం నిర్వహించారు. ఈ వేలంలో పాల్గొనే వారితో ముందుగానే రూ.10 వేలు డిపాజిట్‌ చేయించుకున్నారు. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వేలంలో పాల్గొనగా.. ఓ వ్యక్తి రూ.3 లక్షలకు వేలం పాడి బెల్ట్‌షాపును దక్కించుకున్నాడు. ఇదే గ్రామంలో గతేడాది మూడు బెల్ట్‌షాపులకు రూ.లక్ష చొప్పున వేలం నిర్వహించారు. కానీ ఈ ఏడాది మాత్రం ఒక్క బెల్ట్‌షాపునకు మాత్రమే రూ.3 లక్షలు పలకడం గమనార్హం. వేలంలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు పోటాపోటీగా వేలం పాడినట్లు తెలిసింది. దీంతో గ్రామాల్లో బెల్ట్‌షాపులకు ఎంత డిమాండ్‌ ఉన్నదనేది స్పష్టమవుతోంది. ఇదొక ఆత్మనగర్‌ గ్రామంలోనే కాదు.. మిగతా చోట్ల కూడా ఇదే పరిస్థితి. పల్లెల్లో ఇష్టారీతిగా వేలంపాటలు జరుగుతున్నా.. బెల్ట్‌షాపులు బహిరంగంగానే నిర్వహిస్తున్నా అధికారులు ‘మాములు’గానే తీసుకుంటుండడంతో పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు

ఒక్కో బాటిల్‌పై రూ.10 నుంచి రూ.20 అదనం

చోద్యం చూస్తున్న ఎకై ్సజ్‌ శాఖ

వేలంలో రూ.3 లక్షలు పలికిన ఆత్మనగర్‌ బెల్ట్‌షాపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement