జగిత్యాలక్రైం: దసరా పండుగ సందర్భంగా ఊరెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, దొంగలు ఇళ్లలో చోరీలకు పాల్పడే అవకాశం ఉందని ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ పండుగకు ఊరు వెళ్లే వారు తమ ఇళ్ల భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఊరు వెళ్లేముందు బంగారు, వెండి, డబ్బువంటి విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో దాచుకోవడం మంచిదన్నారు. బీరువా తాళాలు ఇంట్లో కప్ బోర్డులు లేదా ఇతర ప్రదేశాలలో ఉంచొద్దని సూచించారు. ఊరు వెళితే ఇంటి పక్కనవారికి, సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అనుమానిత లేదా కొత్త వ్యక్తులు ఇంటి చుట్టూ తిరగడం కనిపిస్తే వెంటనే 112 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
వృద్ధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
జగిత్యాలజోన్: వృద్ధులను నిర్లక్ష్యం చేస్తే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజాగౌడ్ మాట్లాడుతూ కనిపెంచిన తల్లితండ్రులను వృద్ధాప్యంలో ఆదరించాల్సిన బాధ్యత వారి పిల్లలపై ఉందన్నారు. డీఆర్‌డీఏ పీడీ రఘువరణ్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 409 వృద్ధ సంఘాలు ఉండగా, 4,228మంది సభ్యులు ఉన్నారన్నారు. వృద్ధులకు సెర్ప్ అండగా ఉంటుందని, వారికి ఎక్కడైనా ఇబ్బంది కలిగితే వెంటనే స్పందిస్తామన్నారు. జిల్లా వైద్యశాఖ అధికారి సుజాత మాట్లాడుతూ వృద్ధుల్లో వచ్చే శారీరక సమస్యలు, ఇతరాత్ర అనారోగ్య సమస్యలను ఆరోగ్యకేంద్రాల ద్వారా పరిష్కరిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో ఉత్తమ సేవలు అందించిన స్వశక్తి సభ్యులను ఘనంగా సన్మానించారు. సెర్ప్ అదనపు జిల్లా ప్రాజెక్టు అధికారి సునీత, జిల్లా కోఆర్డినేటర్ మహేశ్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ఆమని, జిల్లా వయో వృద్దుల హక్కుల సంఘం అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్, జిల్లా డీపీఎంలు నాగేశ్వర్‌రావు, రమేశ్, ఏపీఎంలు గంగాధర్, చక్రవర్తి, శ్రీనివాస్, హుస్సేన్ పాల్గొన్నారు.
ఇంటర్ విద్యతోనే భవిష్యత్
ఇబ్రహీంపట్నం: ఇంటర్ విద్యతో విద్యార్థులకు భవిష్యత్ ఉంటుందని డీఐఈవో రమేశ్‌బాబు సూచించారు. శుక్రవారం మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం జూని యర్ కళాశాల రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం అభినందనీ యం అన్నారు. ఎస్సై నవీన్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి కేసుల్లో ఉండకూడదని, విదేశాల్లో చదువుకోవాలన్న, ఉద్యోగం పొందాలన్నా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి అన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
బొమ్మెన ప్రాజెక్టు మరమ్మతుకు రూ.1.22 కోట్లు మంజూరు
కథలాపూర్: కథలాపూర్ మండలం పోసానిపేట శివారులోని బొమ్మెన ప్రాజెక్టు మరమ్మతు పనులకు ప్రభుత్వం రూ.1.22 కోట్లు మంజూరు చేసినట్లు నీటిపారుదలశాఖ ఎస్‌ఈ రమేశ్ తెలిపారు. శుక్రవారం బొమ్మెన ప్రాజెక్టు మత్తడి, కట్టను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ నిధులతో మత్తడి లీకేజీలను పూర్తిస్థాయిలో మరమ్మతు చేయించి, కట్టపై ఉన్న పిచ్చి మొక్కలు తొలగిస్తామన్నారు. ఈఈ ప్రశాంత్, ఏఈ నరేశ్, రాజు, సర్పంచ్ ఆకుల సుజాత, రాజేందర్ ఉన్నారు.


