జగిత్యాల: జగిత్యాల అభివృద్ధి కోసం పార్టీ మారానని చెప్పుకునే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మెడికల్ కళాశాల భవనం ఎందుకు పూర్తి చేయలేదని మాజీమంత్రి జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ జగిత్యాల జిల్లాతో పాటు అన్ని జిల్లాల్లో ప్రారంభమైన మెడికల్ కళాశాల భవనాలు పూర్తయ్యాయని, జగిత్యాల మెడికల్ కళాశాల భవనం పూర్తి కాలేదని, వసతులు కరువై విద్యార్థులు సమ్మె చేయడం ఎమ్మెల్యే చేతకానితనానికి నిదర్శనమన్నారు. మంత్రులు ఇచ్చిన హామీ మేరకు మెడికల్ కళాశాల భవనాన్ని డిసెంబర్ 15లోపు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సారెస్పీ నుంచి ఆరు టీఎంసీల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ జిల్లాలో దశాబ్ది ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, కవులు, కళాకారులను సన్మానిస్తామన్నారు. మాజీ జెడ్పీచైర్‌పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, కేసీఆర్ జిల్లాలను ఏర్పాటు చేసి దశాబ్దకాలం అవుతుందని పేర్కొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే స్వయాన డాక్టర్ అయి ఉండి కూడా విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో హరిచరణ్‌రావు, వెంకటేశ్వర్‌రావు, మల్లేశం, దుర్గయ్య, దేవయ్య, రమేశ్‌బాబు, రాధకిషన్, సురేందర్ పాల్గొన్నారు.


