జగిత్యాల: నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, మాజీమంత్రి జీవన్‌రెడ్డి అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ, స్థానిక సమస్యలను భూతద్ధంలో చూపుతూ తనతో పాటు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సీఎం రేవంత్‌రెడ్డిపై పరుష పదజాలంతో విమర్శలు చేయడం తగదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం 2008లో స్థలం కొనుగోలు చేసినప్పుడు ఆర్‌అండ్‌బీ మంత్రిగా జీవన్‌రెడ్డి ఉన్నారని, అప్పుడు ప్రధాన రహదారికి కిలోమీటరు దూరంలో స్థలం ఎందుకు కొనుగోలు చేయలేదని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ తన మిత్రుడైన జీవన్‌రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చే వ్యూహంలో భాగంగానే తనను పోటీకి నిలబెట్టారని, ఆ ఎత్తుగడలో తాను బలయ్యానన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలపై ఎందుకు వివాదం చేస్తున్నారని ప్రశ్నించారు. డిసెంబర్‌లో మెడికల్ కళాశాలను ప్రారంభించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. బోర్నపల్లి వంతెన నిర్మించకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లాయని, జగిత్యాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రోల్లవాగు కట్టపై జీవన్‌రెడ్డి ఎప్పుడైనా అడుగు పెట్టారా అని ప్రశ్నించారు. డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య మాట్లాడుతూ, జీవన్‌రెడ్డి అభివృద్ధి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి, జ్యోతి, నాగభూషణం, బండ శంకర్, సతీశ్, రాజ్‌కుమార్, కూసరి అనిల్‌కుమార్, కత్తురోజు గిరి, రాజేశ్, ముకేశ్‌కన్నా, దయాల శరత్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు వైద్య విద్యార్థుల సత్కారం
ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వసతులు కల్పించాలని మెడికోలు రెండు రోజులుగా ఆందోళన చేపట్టారు. స్పందించిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కలెక్టర్ సత్యప్రసాద్‌తో పాటు, అదనపు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమాదేవి, ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించారు. జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆర్‌అండ్‌బీ మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నతాధికారులతో చర్చలు జరిపి డిసెంబర్ 15లోపు మెడికల్ కళాశాల భవనం, హాస్టల్ భవనాలు, ప్లేగ్రౌండ్, మెస్ ఏర్పాటు చేసేందుకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మెడికో విద్యార్థులు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను సత్కరించారు.


