జగిత్యాలఅగ్రికల్చర్: ఈనెల 31 నుంచి జగిత్యాల నుంచి ఎనిమిది జిల్లాలకు విద్యుత్ స్తంభాలను సరఫరా చేస్తామని ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి అన్నారు. బల్వంతాపూర్‌లో విద్యుత్ స్తంభాల తయారీ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు ఇక్కడి నుంచే స్తంభాలను సరఫరా చేస్తామని, తద్వారా సేవల్లో వేగం పెరుగుతుందని తెలిపారు. ఇక్కడి యూనిట్‌లో 8.5 మీటర్లు, 9.5, 11 మీటర్ల పొడవున్న స్తంభాలను రోజుకు 700 వరకు తయారు చేస్తారని పేర్కొన్నారు. ఆధునాతన మిక్సింగ్ ప్లాంట్, టెన్షన్ మిషన్, మెకనైజ్డ్ బ్యాచ్ వంటి వాటితో నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. కొత్త విద్యుత్ లైన్లు, సబ్‌స్టేషన్లు, నెట్‌వర్క్ విస్తరణలో భాగంగా విద్యుత్ స్తంభాలకు డిమాండ్ పెరుగుతోందన్నారు. సంస్థ డైరెక్టర్లు వి.మోహన్‌రావు, టి. మధుసూధన్, ఎస్‌ఈ సుదర్శనం, డీఈ ఆపరేషన్స్ గంగారాం, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.


