జగిత్యాలక్రైం: బడికి వెళ్లాల్సిన చిన్నారులు రోడ్డుపై భిక్షాటన చేస్తూ కనిపించడంతో పట్టణ సీఐ కరుణాకర్ చలించిపోయారు. తహసీల్ చౌరస్తా ప్రాంతంలో మంగళవారం నాలుగు, ఐదేళ్ల ఇద్దరు చిన్నారులు భిక్షాటన చేస్తుండగా.. కరుణాకర్ తన వాహనాన్ని ఆపి వారి వద్దకు వెళ్లి వివరాలు ఆరా తీశారు. తల్లిదండ్రులు వీరిని సరిగా పట్టించుకోవడం లేదని తెలుసుకుని చలించిపోయారు. వారిని ఆప్యాయంగా పలకరించి చదువుకుంటారా.. తాను చదివిస్తా.. అన్నారు. దానికి ఆ చిన్నారులు చదుకుంటామని చెప్పడంతో వారిని తనతోపాటు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం బాలల సంరక్షణ అధికారులకు సమాచారం అందించారు. సదరు అధికారులు రావడంతో చిన్నారులను ఆటోలో ఎక్కించి వారి సంక్షేమం, భద్రత తదుపరి చర్యలు చేపట్టేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


