యాసంగిలో 3.53 లక్షల ఎకరాల్లో సాగు | - | Sakshi
Sakshi News home page

యాసంగిలో 3.53 లక్షల ఎకరాల్లో సాగు

Oct 6 2026 11:53 PM | Updated on Oct 6 2026 11:53 PM

పంటల ప్రణాళిక విడుదల అత్యధికంగా 2.19 లక్షల ఎకరాల్లో వరి పెరగనున్న మొక్కజొన్న, నువ్వుల సాగు ఎల్‌నినోతో ఏ మేరకు సాగవుతాయన్నదే అసలు సమస్య

జగిత్యాలఅగ్రికల్చర్‌: యాసంగి పంటల సాగులో జిల్లాలో ఈసారి కూడా వరే ప్రధాన పంటగా మారనుంది. ఆరుతడి పంటలైన మక్క, నువ్వులు, వేరుశెనగ పంటలకు అనువైన వాతావరణం ఉండటంతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ఎల్‌నినో నేపథ్యంలో పంటల సాగు ఏమేరకు అవుతుందనే విషయం సందిగ్ధంగా ఉంది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ యాసంగి సీజన్‌లో సాగు చేసే పంటల ప్రణాళికను విడుదల చేసింది.

సాగు ఇలా..

జిల్లాలో అన్ని రకాల పంటల సాగు విస్తీర్ణం దాదాపు 3.53 లక్షల ఎకరాల వరకు ఉంటుంది. బావులు, కుంటలు, చెరువుల్లో నీరు ఉండడం.. పైగా ఎస్సారెస్పీలో కొంతమేర నీరు చేరడం.. భూగర్భజలాలు ఇంకా ౖపైపెనే ఉండటంతో అన్నదాతలు అధిక సాగుకు సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ సారి వరిని 2.19 లక్షల ఎకరాలు, మక్క 70వేలు, నువ్వులు 14వేలు, ఆయిల్‌ పాం 1019, వేరుశెనగ 1319, మినుము 1023, అలిసెంత 142, సజ్జ 1436, కందులు 98, జొన్న 498, శనగలు 1023 ఎకరాల్లో సాగు చేయనున్నారు. ఉద్యానపంటలైన కూరగాయలు 400ఎకరాల్లో వేయనున్నారు. మామిడితోటలు 38వేల ఎకరాల్లో ఉన్నాయి.

సాగు ముందుకెళ్లేనా..?

ఈ ఏడాది ఎల్‌నినో నేపథ్యంలో ఉష్ణోగ్రతలు ఇప్పు డే 38 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటున్నాయి. భూగర్భజలాలు పడిపోతే పంట చేతికొస్తుందా..? రాదా..? అనే మీమాంసలో రైతులు ఉన్నారు. పంటలు ఎండిపోతే భారీ నష్టం వచ్చే అవకాశం ఉందని మల్లాగుల్లాలు పడుతున్నారు. గతేడాది యాసంగితో పోల్చితే.. ఇప్పుడు 49వేల ఎకరాల్లో పంటలు తగ్గనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పుడున్న నీరు సరిపోదని, ఆరుతడి పంటల వైపు మళ్లాలని ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం వరి సాగును కూడా 85వేల ఎకరాలకు తగ్గిస్తూ ప్రణాళిక రూపొందించారు. మక్కను 25వేల ఎకరాలకు పెంచేలా చూస్తున్నారు. నువ్వుల విస్తీర్ణాన్ని 7 వేల నుండి 14 వేల ఎకరాలకు పెంచారు.

ఆరుతడి పంటలకు పెద్దపీట

యాసంగిలో వరి విస్తీర్ణాన్ని తగ్గించి.. మక్క, నువ్వుల వంటి ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. ఎల్‌నినో నేపథ్యంలో సాగునీటికి ఇబ్బందులు ఉన్న దృష్ట్యా పంటల సాగుపై రైతులు పునరాలోచన చేయాలి.

– వడ్డేపల్లి భాస్కర్‌, డీఏవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement