వానాకాలం గట్టెక్కినట్టే..! | - | Sakshi
Sakshi News home page

వానాకాలం గట్టెక్కినట్టే..!

Aug 3 2026 12:01 AM | Updated on Aug 3 2026 12:01 AM

ఎస్పారెస్పీలోకి చేరుతున్న వరద నీరు

పూర్తిస్థాయిలో నిండిన చెరువులు, కుంటలు

వానాకాలం, యాసంగికి ఢోకా లేదంటున్న రైతులు

సాధారణాన్ని మించి 21శాతం ఎక్కువ వర్షపాతం

రెండు పంటలకు భరోసా

హమ్మయ్యా..

జగిత్యాలఅగ్రికల్చర్‌: ఎల్‌నినో ప్రభావంతో వారం క్రితం 52శాతం లోటు వర్షపాతం ఏర్పడగా.. వేసిన పంటలు పండుతాయో..లేదోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. అలాంటి తరుణంలో మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలు రైతులకు భారీగా ఊరటనిచ్చాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లోటు నుంచి 21 శాతం అధిక వర్షాపాతానికి చేరింది. చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండి మత్తళ్లు దూకాయి.

సాధారణ వర్షపాతం 451.1 మిల్లీమీటర్లు

జూన్‌ ఒకటో తేదీ నుంచి ఆగస్టు 2 వరకు జిల్లా సాధారణ వర్షపాతం 451.1 మిల్లీమీటర్లు కాగా.. ఇటీవల కురిసిన వర్షాలతో 547 మిల్లీమీటర్లకు చేరింది. ఈ లెక్కన ఏకంగా 21 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అయితే గొల్లపల్లి మండలంలో 8 శాతం, భీమారంలో 7, ఇబ్రహీంపట్నంలో 2, కథలాపూర్‌లో ఒక శాతం ఇంకా లోటుగానే ఉంది. వెల్గటూర్‌ మండలంలో 87శాతం, బుగ్గారంలో 55, సారంగాపూర్‌లో 54, ఎండపల్లిలో 45, ధర్మపురిలో 37, బీర్‌పూర్‌లో 33, మల్యాలలో 34, రాయికల్‌లో 26, మేడిపల్లిలో 21శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. మల్లాపూర్‌లో 18, జగిత్యాల రూరల్‌లో 12, జగిత్యాలలో 8, కోరుట్లలో 6, మెట్‌పల్లిలో 4, కొడిమ్యాలలో 8 శాతం చొప్పున సాధారణ స్థాయి వర్షపాతం నమోదైంది.

పొదుపుగా వాడుకుంటే రెండు పంటలకు నీరు

మూడు రోజులు కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు, బావులు జలకళను సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటే ఈ వానాకాలంతోపాటు యాసంగి పంటలకు కూడా సరిపోయే అవకాశం ఉంది. అయితే చాలా చెరువుల్లోని నీటిని ఇష్టారాజ్యంగా పొలాలకు వదులుతుండటంతో యాసంగి నాటికి నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది.

వరదకాలువలో 0.5 టీఎంసీ నీరు

మల్యాల: మొన్నటివరకు చుక్కనీరు లేని వరదకాలువ ఎత్తిపోతలతో జలకళ సంతరించుకుంది. ఎగువన ఉన్న ఎస్సారెస్పీని నింపేందుకు తవ్విన ఈ వరదకాలువ మల్యాల మండలంలో 60వేల ఎకరాలకు ఆధారమవుతోంది. వరదకాలువలో ఆరు కిలోమీటర్ల దూరం సుమారు 0.5 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నీటితో వానాకాలం గట్టెక్కనుంది. ఎస్సారెస్పీలో నీరు లేనప్పుడు రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ప్రాజెక్టు నింపేందుకు చేపట్టిన ఈ పథకం కాలువ పొడువునా ఉన్న మండలాల్లోని పంటలకు జీవం పోస్తోంది. రామడుగు గాయత్రి పంప్‌హౌస్‌ నుంచి వరదకాలువలో నీటిని ఎత్తిపోస్తుండడంతో గ్రావిటీ ద్వారా రాంపూర్‌ పంప్‌హౌస్‌కు.. అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా రాజేశ్వరరావుపేట పంప్‌హౌస్‌కు నీరు చేరనుంది. అనంతరం ముప్కాల్‌ వరకు వరదకాలువలో నీటిని నిల్వ చేయనున్నారు.

ఇక్కడి ప్రాంత రైతలందరం వరదకాలువపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నాం. మొన్నటివరకు కాలువలో చుక్కనీరు లేకపోవడంతో అయోమయంలో పడిపోయాం. ఇప్పుడు భారీ వర్షాలు కురవడం.. కాలువలోకి ఎత్తిపోతలు ప్రారంభం కావడంతో పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నాం. వరదకాలువలో నీటి నిల్వ చేయడం ద్వారా వానాకాలం పంటలకు ఢోకా లేదు.

– ముద్దం శ్రీనివాస్‌, రైతు, నూకపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement