మండల పరిషత్ సమావేశాలకు నిర్ణయం
45రోజులకోసారి నిర్వహణకు ఆదేశం
హాజరుకానున్న అధికారులు, సర్పంచులు
అభివృద్ధి, ఇతరత్రా సమస్యలపై చర్చ
జిల్లాలో 20 మండలాలు, 385 పంచాయతీలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు
జగిత్యాలరూరల్: గ్రామ పాలన వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి 45 రోజులకు ఒకసారి ఎంపీడీవో కార్యాలయాల్లో సాధారణ సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జూన్ 24న పాలకవర్గ సభ్యుల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు పరిషత్ సమావేశాలు నిర్వహించలేకపోయారు. గతంలో ఎంపీపీ అధ్యక్షతన ఎంపీడీవో ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసేవారు. జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యేవారు. పరిషత్ సభ్యుల పదవీకాలం ముగియడంతో మండలాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి పాలన కొనసాగిస్తున్నారు. అధికారులను నియమించినప్పటికీ సమావేశాలు మాత్రం నిర్వహించలేదు. ఈ క్రమంలో అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసి.. అనంతరం ప్రతి 45 రోజులకోసారి నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సంక్షేమం, సమస్యలపై చర్చ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పథకాల అమలు, గ్రామాలవారీగా నెలకొన్న సమస్యలపై సభ్యులు చర్చించనున్నారు. గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కీలక సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి తీసుకునే నిర్ణయాలపై తీర్మానాలు చేస్తారు. వీటితో పాటు అధికారుల తీరుపై ప్రశ్నిస్తారు. ఫలితంగా గ్రామ పరిపాలన వ్యవస్థ బలోపేతం అయ్యే అవకాశాలు ఉంటాయి.
పరిషత్ సభ్యులు లేకుండా ..
సాధారణంగా మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన కోరం సభ్యులతో నిర్వహిస్తారు. ప్రస్తుతం పరిషత్ సభ్యులు లేకుండానే సమావేశం నిర్వహించనున్నారు. మండల ప్రత్యేక అధికారి తప్పనిసరిగా హాజరు కావాలి. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల పరిధిలో 385 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మండల కేంద్రాల్లో నిర్వహించే సమావేశాలకు ఆయా గ్రామపంచాయతీల సర్పంచులు హాజరుకానున్నారు.
జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రతి 45 రోజులకోసారి మండలస్థాయి అధికారులు, సర్పంచులతో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మండల పరిషత్ సమావేశాలు ఇప్పటికే నిర్వహణ కొనసాగుతోంది.
– మదన్‌మోహన్, జిల్లా పంచాయతీ అధికారి


