ప్రధాన ఆస్ప​‍త్రిలో నీటి కటకట | - | Sakshi
Sakshi News home page

ప్రధాన ఆస్ప​‍త్రిలో నీటి కటకట

Jun 7 2026 8:06 AM | Updated on Jun 7 2026 8:06 AM

● పనిచేయని నల్లాలు ● తరచూ పైప్‌లైన్ల లీకేజీలు ● తాగునీటికి అల్లాడుతున్న రోగులు ● బయట నుంచి తెస్తున్న బంధువులు

జగిత్యాల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి నిత్యం వేలాది మంది రోగులు వస్తుంటారు. కొద్దిరోజులుగా పైప్‌లైన్‌లు లీకేజీ కావడంతో మంచినీరు రాక రోగులు నానా తంటాలు పడుతున్నారు. ఈ ఆస్పత్రికి నిత్యం చికిత్స కోసం జిల్లాతోపాటు, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాలవారు వస్తుంటారు. ఆస్పత్రిలో నీటి సరఫరా నిలిచిపోవడంతో వారంతా అల్లాడిపోతున్నారు. వాష్‌రూమ్‌లలో నీరు రాక కంపు కొడుతున్నాయి. నల్లాలు పనిచేయక గుక్కెడు నీటి కోసం రోగుల బాధలు వర్ణణాతీతంగా మారింది. వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం, ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయకపోవడంతో తాగునీటిని బయట నుంచి కొనుగోలు చేసుకుంటున్నారు. తాగడానికి కొనుగోలు చేసుకుంటున్నప్పటికీ మలవిసర్జన, స్నానాలకు బాత్‌రూమ్‌లలో నీరు రాకపోవడంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. బెడ్‌పై నుంచి లేవలేని రోగులు, బెడ్‌పైనే ఉన్న రోగులకు తప్పనిసరిగా నీటి అవసరం ఉంటుంది. ప్రతి జనరల్‌ వార్డులో అత్యధిక రోగులుంటారు. బాత్‌రూమ్‌లలో నీరు రాకపోవడంతో మౌళిక వసతులకు ఇబ్బందికరంగా మారింది.

డయాలసిస్‌కూ అదే పరిస్థితి

ఇదే ఆస్పత్రిలో డయాలసిస్‌ సెంటర్‌ కూడా ఉంది. వాస్తవానికి ఈ కేంద్రానికి అత్యధికమైన నీరు అవసరం ఉంటుంది. దీనికి సపరేట్‌ ప్లాంట్‌ ఉందని, నీరు వస్తోందని అధికారులు చెబుతున్నా.. ఒకవేళ పరిస్థితి చేయిదాటితే పేషెంట్ల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారుతుంది.

ప్రజాప్రతినిధులూ.. జర చూడండి

జిల్లాకే ఈ ఆస్పత్రి గుండెకాయ లాంటిది. ఇటీవల మెడికల్‌ కళాశాల కావడంతో నిత్యం వందలాది మంది రోగులు వస్తుంటారు. దాదాపు వెయ్యికి పైగా అవుట్‌ పేషెంట్స్‌ ఉంటారు. వీరిలో 300కు పైగా ఇన్‌పేషెంట్స్‌ ఉంటారు. ఇలాంటి ఆస్పత్రిలో నీటి సరఫరా నిలిచిపోయినప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు కనీసం పట్టించుకోకవడం శోచనీయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

చెడిపోయిన పైప్‌లైన్‌

ఆస్పత్రికి వచ్చే మున్సిపల్‌ పైప్‌లైన్‌ చెడిపోవడంతోనే నీరు సరిగా రావడం లేదని వైద్యాధికారులు అంటున్నారు. అయినప్పటికీ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు. కనీసం మున్సిపల్‌ ట్యాంకర్ల ద్వారా సంపుల్లో నీరు నింపితే రోగులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రజలకు, ఆస్పత్రికి వచ్చిన రోగులకు మంచినీటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.

ఒకవైపు ఎండలు.. ఉక్కపోత

ఆస్పత్రిలో ఎలాంటి వసతులు లేకపోవడం.. మరోవైపు ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. దాహంతో అల్లాడుతున్నారు. కొంతకాలంగా ఇదే పరిస్థితి ఉన్నా.. పట్టించుకోవాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇప్పటికై నా స్పందించి వెంటనే మంచినీటి సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి

జనరల్‌ ఆస్పత్రిలో నీరు రాని ట్యాప్‌

ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం

మున్సిపల్‌ ద్వారా వచ్చే నీటి పైప్‌ మరమ్మతులతో మంచినీటి సౌకర్యం నిలిచిపోయింది. మున్సిపల్‌ ట్యాంకర్ల ద్వారా తెప్పించి సంప్‌లో పోయించేలా చర్యలు తీసుకుంటున్నాం. రోగులు, వారి బంధువులు బయట కొనుగోలు చేయకుండా ఉన్న నీటిని వినియోగించుకోవాలి. – విజయ్‌, ఆర్‌ఎంవో

Advertisement
 
Advertisement
Advertisement