వేగవంతంగా చర్యలు
జగిత్యాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని, వచ్చే జూన్ 12లోపు లక్ష్యం చేరుకునేలా చూడాలని ఇటీవల ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే జిల్లాకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యాన్ని చూస్తే ప్రభుత్వ సూచనలకు అందనంతా దూరంలో కనిపిస్తోంది. జిల్లాకు మొదటి విడత 10,865 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటివరకు కేవలం 751మాత్రమే పూర్తయ్యాయి. బేస్‌మెంట్ వరకు 1,743, వాలింగ్ వరకు 1,028, రూప్‌కాస్ట్ వరకు 3,968 కొనసాగుతున్నాయి. మొత్తం కలిపి 50శాతానికి చేరువలో ఇళ్ల నిర్మాణం ఉన్నప్పటికీ గృహప్రవేశం చేసేందుకు మాత్రం అవకాశం కనిపించడం లేదు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాకపోవడం.. ఖర్చులు తడిసిమోపెడు కావడం.. ఇసుక దొరకకపోవడం జాప్యానికి కారణంగా తెలుస్తోంది. ఈ సమస్య గ్రామీణప్రాంతాలతోపాటు పట్టణాల్లోనూ అధికంగా ఉంది.
తప్పని ఇబ్బందులు
పేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినప్పటికీ నిర్మించుకోవడానికి లబ్ధిదారులకు ఇబ్బంది తప్పడం లేదు. ప్రభుత్వం జూన్ 12 వరకు ఇళ్లు పూర్తిగా గ్రౌండింగ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొన్నిచోట్ల ఇసుక దొరుకకపోవడం, మరికొన్ని చోట్ల ఇటుకలు, ఇతర సామగ్రి లేకపోవడం.. దొరికినా అత్యధిక రేట్లు ఉండటంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గోదావరి నుంచి ఇసుక ట్రాక్టర్ల ద్వారా వస్తున్నా అది ఎటూ సరిపోవడం లేదు. కొన్నిచోట్ల ఉచితంగా ఇసుక ఇస్తున్నప్పటికీ జాప్యం జరుగుతోంది. ఉన్నతాధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ గృహ నిర్మాణం త్వరగా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వాస్తవానికి జూన్ నుంచి వర్షాకాలం ఆరంభం అవుతుంది. ఇళ్ల నిర్మాణాలు నెమ్మదిగా సాగుతాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కరెంట్, ప్లంబర్, టైల్స్, కలర్స్ వంటి పనులు కాకున్నా.. గోడలు పూర్తయి దర్వాజలు పెట్టుకున్నా.. బిల్లులు వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు.
మహిళ సంఘాల ద్వారా రుణాలు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నిధులు లేని పక్షంలో మహిళ సంఘాల ద్వారా రుణాలు అందించాలని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు కొందరు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లోన్లు తీసుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికీ జిల్లాలో రూ.11.60 కోట్ల రుణాన్ని లబ్ధిదారులకు అందించి ఇళ్ల నిర్మాణం చేపట్టుకునేలా ప్రోత్సహిస్తున్నారు.
మంజూరైన ఇళ్లు 10,865
మార్కవుట్ చేసింది 8,946
బేస్‌మెంట్ వరకు 1,743
వాలింగ్ 1,028
రూప్‌కాస్ట్ 3,968
పూర్తయినవి : 751
బిల్లుల మంజూరులో జాప్యం
జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా జరుగుతున్నప్పటికీ బిల్లుల మంజూరులో జాప్యం ఎదురవుతోంది. కొందరు లబ్ధిదారులకు టెక్నికల్ సమస్యలతో రావడం లేదని అంటున్నారు. బిల్లులు తొందరగా ఇస్తే ఇళ్లు త్వరగా పూర్తవుతాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. లక్ష్యం చేరుకునే అవకాశాలున్నాయి. బిల్లుల మంజూరుకు ప్రభుత్వం కొన్ని వెసులుబాటు కల్పించింది. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.
– భాస్కర్, ఇన్‌చార్జి పీడీ


