జగిత్యాల: హనుమాన్ చిన్న జయంతికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఇబ్బంది రాకుండా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్‌లో ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి మాట్లాడారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 3వరకు కొండగట్టులో నిర్వహించనున్న ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వేసవికాలం దృష్ట్యా తాగునీరు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్, లైటింగ్, భద్రత కల్పించాలని, రాత్రివేళల్లో సరిపడా లైటింగ్ ఉంచాలన్నారు. దీక్షాపరులకు ఉపశమనం కలిగించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. మాలవిరమణ, కేశఖండన, కోనేరు ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. సీసీకెమెరాలు, వైద్యసేవలు, పారిశుధ్యం, అగ్నిమాపక చర్యలు చేపట్టాలన్నారు. రాత్రివేళల్లో నడిచి వచ్చే భక్తులకు రేడియం స్టిక్కర్లు కనిపించేలా చూడాలన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, ఆలయ ఈవో అంజనరెడ్డి పాల్గొన్నారు.


