జగిత్యాల: గ్రంథాలయాలకు మున్సిపాలిటీలు, పంచాయతీలు సెస్ చెల్లించాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. గ్రంథాలయం, మున్సిపల్ అధికారులతో సమావేశమయ్యారు. నిబంధనల ప్రకారం 8 శాతం పన్ను బకాయిలను సకాలంలో చెల్లించాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సరిత, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
పైడిమడుగు సంఘానికి కలెక్టర్ అభినందనలు
జగిత్యాల/జగిత్యాలఅగ్రికల్చర్: కోరుట్ల మండలం పైడిమడుగు సహకార సంఘం జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డు పొందడంపై కలెక్టర్ సత్యప్రసాద్ అభినందించారు. సోమవారం సంఘం అధికారులను పిలిచి సన్మానించారు. రైతులకు మరిన్ని సేవలు అందించి ఇతర సంఘాలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్, పైడిమడుగు సంఘం పర్సన్ ఇన్‌చార్జి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అసద్, కార్యదర్శి రాజేందర్, శ్యామ్‌సుందర్ పాల్గొన్నారు.
పరీక్ష కేంద్రాల తనిఖీ
జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్‌లో జరుగుతున్న పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. సిబ్బంది నిబద్ధతో బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. ఆయన వెంట డీఈవో రాము, ఆర్డీవో మధుసూదన్ ఉన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయండి
జగిత్యాలటౌన్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ఉపకార వేతనాలు విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం జగిత్యాల కొత్త బస్టాండ్ వద్ద నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు కొత్తబస్టాండ్‌కు చేరుకున్నారు. విద్యార్థులు ఆందోళన విరమించకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనాల్లో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు.


