కోరుట్లరూరల్: అదనపు కట్నం కోసం గర్భవతి అయిన భార్య వైష్ణవిని కత్తితో పొడిచి, గొంతు నులిమి అతి దారుణంగా చంపిన ఆమె భర్త చిత్తరి హరిబాబును కోరుట్ల పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. డీఎస్పీ అడ్లూరి రాములు వివరాలు వెల్లడించారు. మాదాపూర్ గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ కూతురు వైష్ణవిని హరిబాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత హరిబాబుకు కట్నం కింద రూ.ఐదు లక్షల నగదు, మాదాపూర్‌లో రెండు గుంటల భూమి ఇచ్చారు. అదనంగా మరో రూ.5 లక్షలు కట్నం కావాలని హరిబాబు తల్లి లక్ష్మీ, సోదరులు ఆనంద్, అశోక్ ప్రోద్బలంతో కొంతకాలంగా హరిబాబు వైష్ణవిని వేధిస్తున్నాడు. సోమవారం రాత్రి వైష్ణవి, హరిబాబు గొడవపడ్డారు. వైష్టవి నిద్రించిన తర్వాత హరిబాబు ఆమె మెడపై కత్తితో పొడిచి, గొంతు నులిపి చంపేసి పారిపోయాడు. వైష్ణవి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తుండగా.. కోరుట్ల శివారు కోనరావుపేట రోడ్‌లోగల డబుల్ బెడ్‌రూం ఇళ్ల వద్ద ఉండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు ఉపయోగించిన ద్విచక్రవాహనం, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి, పోలీసులు పాల్గొన్నారు.
వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాములు
నిందితుడిని రిమాండ్‌కు తరలింపు


