ఎన్నికలకు సమాయత్తం
జిల్లాకేంద్రంలోనే అన్ని బల్దియాల కౌంటింగ్ ఎస్‌కేఎన్‌ఆర్ కళాశాలలో స్ట్రాంగ్‌రూంలు పరిశీలించిన కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్
జగిత్యాల: పుర ఎన్నికలకు అధికారులు సర్వంసిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ఆదేశాల మేరకు ఇప్పటికే తుది ఓటరు జాబితా విడుదలైంది. రిజర్వేషన్లు ఖరారు కావడం.. రెండుమూడు రోజుల్లో నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అధికారయంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును జిల్లాకేంద్రంలోనే చేపట్టనున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటికి కావాల్సిన విద్యుత్ సరఫరా, తాగునీటి వసతి, టాయిలెట్స్, దివ్యాంగుల కోసం ర్యాంప్‌లు తదితర మౌలిక వసతులు కల్పించారు. పోలింగ్ స్టేషన్ల వారీగా ఫొటోలతో కూడిన జాబితాను తయారుచేస్తున్నారు. బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేసుకుంటున్నారు. ఐదు మున్సిపాలిటీల పరిధిలో 136 వార్డులు ఉన్నాయి. వాటికి సంబంధించిన బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధంగా ఉంచుకున్నారు. అదనంగా 20శాతం బాక్సులను తెప్పించుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే మిగిలిన ప్రక్రియ కోసం సిద్ధంగా ఉన్నారు.
జగిత్యాలలోనే కౌంటింగ్
జిల్లా కేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్ (ప్రభుత్వ) డిగ్రీ కళాశాలలోనే ఐదు మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎలక్షన్ అయిన ఒకరోజు తర్వాత కౌంటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. గతంలో ఐదు మున్సిపాలిటీలకు సంబంధించి జగిత్యాలలోని వీఆర్‌కే కళాశాలను ఎంపిక చేశారు. ప్రస్తుతం అది నిర్వహణ లేకపోవడంతో ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో కౌంటింగ్‌హాల్, భద్రత ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, స్ట్రాంగ్‌రూమ్‌లు, వచ్చిపోయే మార్గాలను పరిశీలించి ప్రతిపాదనను ఎన్నికల కమిషన్‌కు పంపించారు. అక్కడి నుంచి అనుమతులు రాగానే కౌంటింగ్ ప్రక్రియకు కళాశాలను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలను సందర్శించారు. ఇబ్బందులు లేకుండా ఉంటుందా..? లేదా..? అని అన్ని అంశాలను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేసే వీలు.. పార్కింగ్ అంశాలపై పూర్తిస్థాయిలో పరిశీలన చేశారు. కళాశాల 32ఎకరాల్లో ఉండడం.. చుట్టూ ప్రహరీ కలిగి ఉండటంతో కౌంటింగ్‌కు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం. ఐదు మున్సిపాలిటీలు కావడంతో ప్రజాప్రతినిధులు, ప్రజలు కూడా భారీగా తరలివచ్చే అవకాశం ఉంటుంది. చుట్టూ 100 మీటర్ల మేర పరిశీలన చేశారు. అంతేకాకుండా వచ్చిపోయే మార్గాలను గుర్తించారు. కళాశాలకు సుదూర ప్రాంతాల్లో భారీకేడ్లు ఏర్పాటు చేయనున్నారు. బ్యాలెట్ బాక్స్‌లు, ఇతర సామగ్రి సిబ్బందికి అందించేందుకు సంబంధిత కేంద్రాలను పరిశీలిస్తున్నారు. ఈ విషయమై కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని, ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల ఐదు మున్సిపాలిటీల కౌంటింగ్‌కు కేటాయించాలని ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదించామని తెలిపారు.
బల్దియా వార్డులు ఓటర్లు పోలింగ్‌కేంద్రాలు
ధర్మపురి 15 14,222 24
జగిత్యాల 50 96,410 149
రాయికల్ 12 13,195 24
కోరుట్ల 33 63,741 94
మెట్‌పల్లి 26 46,371 64
మొత్తం 136 2,33,939 355


