రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
ధర్మపురిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.264కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం పాల్గొన్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ధర్మపురి: పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తూ.. రాష్ట్రాన్ని అభివృద్ధిపథం వైపు నడిపిస్తూ ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ధర్మపురిలో రూ.264కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు వ్యవసాయశాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మన్‌కుమార్‌తో కలిసి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం భట్టి మాట్లాడుతూ విద్య, వైద్యరంగాలకు పెద్దపీట వేస్తున్నామని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. మండలంలోని నేరెల్ల సమీపంలో సుమారు 25 ఎకరాల్లో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మిస్తామన్నారు. అభివృద్ధి అంటే భవనాల నిర్మాణం కాదని, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులఊబిలోకి నెట్టిందని, రెండేళ్లుగా వడ్డీలు చెల్లించడానికి సరిపోతోందని అన్నారు. గోదావరి తీరంలో రూ.17కోట్లతో సీనరేజ్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. అలాగే పట్టణంలో రూ.10కోట్లతో నిర్మించనున్న డిగ్రీ కళాశాల, రూ.రెండు కోట్లతో నిర్మించనున్న ఎస్పీ వసతి గృహానికి భూమిపూజ చేశారు. పట్టణంతోపాటు దొంతాపూర్‌లో రూ.2.58కోట్ల చొప్పున వెచ్చించి ఏర్పాటు చేసిన విద్యుత్‌సబ్‌స్టేషన్లను ప్రారంభించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతులు తక్కువ ఖర్చు.. ఎక్కువ లాభాలు వచ్చే పంటలు పండింంచాలని తెలిపారు. ధర్మపురికి మూడు సొసైటీలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల అభివృద్ధి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మున్సిపల్ పరిధి లోని 142 మహిళాసంఘాలకు రూ.48.22లక్షల వడ్డీలేని రుణాలు అందించారు. ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్, మక్కాన్‌సింగ్, విజయరమణారావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సత్యప్రసాద్, నృసింహాలయ చైర్మన్ జక్కు రవీందర్, ఈవో శ్రీనివాస్ తదితరులున్నారు. ముందుగా ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, తుమ్మల, అడ్లూరి
కార్యక్రమానికి హాజరైన ప్రజలు
రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం


