‘ఉపాధి’ ముందుకా.. వెనక్కా..!
‘మహత్మాగాంధీ’ స్థానంలో కొత్తగా ‘వీజీబీ రాంజీ’ ఏప్రిల్ నుంచి అమలుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ వ్యతిరేకిస్తూ తీర్మానం పంపిన రాష్ట్ర ప్రభుత్వం
జగిత్యాలరూరల్: గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు కూలీలకు100 రోజులపాటు పని చూపించి వేతనం అందిస్తోంది. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పథకం పేరు మార్చి కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. వికాస్ భారత్ రోజ్‌గార్ అవాజిక మిషన్ గ్రామీణ పథకం (వీబీజీరాంజీ)గా అమలు చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు తీర్మానం చేసి పంపించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపించడంతో రాష్ట్రంలో అమలవుతుందా..? లేదా..? అనేది సందిగ్ధంలో పడింది.
కొత్త పథకంలో 125 పనిదినాలు
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అన్ని రా ష్ట్రాల్లో వీబీజీరాంజీ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా కూలీ లకు 125 రోజులపాటు పనిదినాలు కల్పించనుంది. పథకం రాష్ట్రంలో అమలైతే ప్రతి కూలీకి గతంలో కంటే 25 పనిదినాలు పెరగనున్నాయి. ఈ లెక్కన కూలీలకు ఉపాధి అవకాశాలు మెరుగవనున్నాయి.
52 లక్షల మొక్కల టార్గెట్
జిల్లాలో ఉపాధి పథకం ద్వారా 2026–27 సంవత్సరానికిగాను 385 నర్సరీల్లో 52 లక్షల మొక్కలను పెంచాలని లక్ష్యం పెట్టుకున్నారు. లక్ష్యం మేరకు నర్సరీల్లో మొక్కలు పెంచి వాటిని ఆయా గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలతో పాటు రహదారుల వెంట ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
చేతినిండా పని
గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త పథకం అమలులోకొస్తే చేతినిండా పని దొరకనుంది. మొక్కల సంరక్షణ, గుంతలు తీయడం, కాలువల ఆధునీకరణ, రహదారుల నిర్మాణం, ఇతర పనులతో కూలీలు 125 రోజుల పాటు పని అందుకోనున్నారు.
జిల్లాలో మండలాలు: 20
జాబ్‌కార్డులు: 1.68 లక్షలు
కూలీలు: 1.39 లక్షలు
గుర్తింపు పొందిన పనులు : 14 వేలు
కేటాయించిన నిధులు : రూ.66.75 కోట్లు
నర్సరీలు : 385


