
పండుగ తర్వాత పత్తి కొనుగోళ్లు
● వెల్గటూర్‌లో సీసీఐ కేంద్రం ● నిబంధనలు కఠినతరం
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో పత్తి కొనుగోళ్లకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. కాటన్ కార్పొరేషన్ ఇండియా (సీసీఐ) ద్వారా వెల్గటూర్ మండలంలోని జిన్నింగ్ మిల్లు పాయింట్ ఏర్పాట్లు చేస్తున్నారు. పింజ పొడువు, రకాన్ని బట్టి పత్తికి మద్దతు క్వింటాల్‌కు ధర రూ.8,110గా ప్రభుత్వం నిర్ణయించింది. మధ్య రకం పొడువు పింజ పత్తికి రూ.7,710. ఇది గతేడాదితో పోల్చితే క్వింటాల్‌కు రూ.589 అదనం.
పత్తి దిగుబడి అంచనా 1.98 లక్షల క్వింటాళ్లు
జిల్లాలో పత్తిని 16,556 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. ఎక్కువగా ధర్మపురి మండలంలో 2,972 ఎకరాలు, ఎండపల్లిలో 2,749, వెల్గటూర్‌లో 2,400, కొడిమ్యాలలో 1,564, గొల్లపల్లిలో 1,630, బీర్‌పూర్‌లో 1,640, బుగ్గారంలో 1140 ఎకరాల్లో సాగవుతోంది. ఈసారి విత్తనాలు వేసినప్పటి నుంచే వర్షాలు మొదలయ్యాయి. దీంతో కలుపు తీయడం, ఎరువులు వేయడం సాధ్యం కాలేదు. నీరు నిలవడం, భూమి తేమగా ఉండటంతో తెగుళ్ల విజృంభించి దిగుబడి తగ్గింది. ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కానీ.. వాతావరణ పరిస్థితుల నేపథ్యలో 8క్వింటాళ్లు కూడా వచ్చే ఆస్కారం లేదు. మొత్తంగా 1.98లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు భావించినా.. 1.32లక్షల క్వింటాళ్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
యంత్రాంగం సిద్ధం
దీపావళి తర్వాత పత్తి కొనేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దళారులు క్వింటాల్‌కు రూ.5వేల నుంచి రూ.ఏడు వేలలోపే చెల్లిస్తున్నారు. ఓపెన్ మార్కెట్‌లో రేటు లేకపోవడంతో సీసీఐ కొత్త నిబంధనలు తెస్తోంది. పత్తి విక్రయించే రైతులకు ఆధార్ తప్పనిసరి చేసింది. ఆధార్ బయోమెట్రిక్ నిర్ధారణ అయ్యాకే కొననుంది. డబ్బులను కూడా ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాకే జమ చేసే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు.