
రోడ్డు ప్రమాదంలో పారిశుధ్య కార్మికురాలి మృతి
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థ పరిధిలోని 56వ డివిజన్‌లో పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తున్న బడుగు రేణుక శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. విద్యానగర్ రోడ్డులోని శివ థియేటర్ పెట్రోల్ బంక్ సమీపంలో రేణుకను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. తోటి కార్మికులు హాస్పిటల్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మరణించింది. విషయం తెలుసుకున్న నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మృతదేహం వద్దకు చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.20 వేల నగదు అందించారు. మృతురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఎంహెచ్‌వో సుమన్, శానిటేషన్ సూపర్‌వైజర్లు శ్యామ్‌రాజ్, అనిల్‌కుమార్ ఉన్నారు. కాగా మృతురాలి కొడుకు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.